కేంద్రంలో మరోసారి మోడీ నేతృత్వంలో భాజపా సర్కారు వచ్చింది. తెలుగు రాష్ట్రాల పట్ల మోడీ వైఖరి గతంలో మాదిరిగానే ఉంటుందా, ఈసారి ఏమైనా మారుతుందా అనే చర్చ కూడా ఉంది. అయితే, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి ముందే స్పష్టమైపోయింది. ఆంధ్రా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని ఎన్నికల ముందు చెప్పినా, ఇప్పుడు మద్దతు అవసరం లేని మోడీ సర్కారు ఉంది కాబట్టి… ఆంధ్రా ప్రయోజనాలను బతిమాలో బామాలో సాధించుకుందామనే వైఖరికి జగన్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై కూడా ఇచ్చేవరకూ కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామనేశారు. సో… కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి డీల్ చేసే విధానం ఎలా ఉంటుందో తెలిసిపోయింది.
ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… కేంద్రంతో ఆయన వైఖరి ఎలా ఉంటుందనేది కూడా కొంత స్పష్టత వచ్చేసింది. అంశాలవారీగా మాత్రమే కేంద్రంతో పోరాడి తెలంగాణ కేటాయింపుల్ని దక్కించుకుంటామనే విధంగా ఆయన తీరు ఉంది. అయితే, కేంద్రంలో భాజపాతో సన్నిహితంగా ఉండేందుకే కేసీఆర్ కూడా అప్రయత్నంగా మొగ్గు చూపుతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవరాల్ గా… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ అసరమైతే కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంటుందా… అంటే, జగన్ కేసీఆర్ ల వైఖరి చూస్తే అది సాధ్యమా అనే అనుమానమే కలుగుతుంది.
ఇప్పుడు అసలు విషయానికొద్దాం. గవర్నర్ నర్సింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకి ఇద్దరు ముఖ్యమంత్రులూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అయితే, ఈ విందులో కేంద్రం తీరుపై కూడా ఇద్దరూ చర్చించుకున్నారు. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రమే విభేదాలు సృష్టించిందనీ, ఇకపై కేంద్రానికి ఆ అవకాశం ఇవ్వొద్దనీ ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం చూస్తే ఎలా ఉందంటే… ఇద్దరు సీఎంలూ తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం కలిసి కేంద్రంతో పోరాడతానే అర్థం ధ్వనించేలా ఉంది. అదే జరిగితే మంచిదే. కానీ, కేంద్రంతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవసరాలు వేరు, కేసీఆర్ అవసరాలు వేరు. ఈ అవసరాలకు లోబడి ఇద్దరూ కేంద్రంలోని మోడీకి అనుకూలంగా ఉన్నంతకాలం ఏ ఇబ్బందులూ ఉండవు. కానీ, ఇదో ధోరణిలో ఇద్దరు సీఎంలూ వ్యవహరిస్తే… ఆంధ్రాకి కేంద్రం నుంచి దక్కాల్సినవీ, తెలంగాణకు రావాల్సినవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటాయి. ఇద్దరూ ముఖ్యమంత్రులూ కలిసి… తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఢిల్లీకి ఇవ్వొద్దని చర్చించుకునే కంటే, విభజన చట్టం అమలూ హక్కుల సాధనకు కలిసి కేంద్రంతో తలపడదామని నిర్ణయించుకుంటే బాగుండేది.