ప్రజలిచ్చిన తీర్పుకనుగుణంగా ఆర్నెళ్ల నుంచి ఏడాదిపాటు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అప్పటి వరకు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకునే అంశంపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ప్రజలు పూర్తిస్థాయిలో తీర్పును ఇవ్వడంతో కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన హామీలును అమలు జరిపేందుకు కొంత గడువు ఇవ్వాలని, అందువల్ల ఆర్నెళ్ల నుంచి సంవత్సరంపాటు జరుగుతున్న కార్యక్రమాలను గమనించటంతోపాటు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహారించాలని టీడీపీలోని అన్ని స్థాయిల నేతలకు సమాచారం పంపారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్ ను అభినందించేందుకు టీడీపీ శాసనసభపక్షం నుంచి ఒక బృందాన్ని పంపారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ తో కూడిన ఈ బృందం అపాయింట్ మెంట్ అడిగినప్పటికి.. జగన్ క్యాంప్ ఆఫీస్ స్పందించలేదు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు.. జగన్ ను అభినందిస్తూ లేఖ రాశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహారిస్తామని, ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు అందిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని విమర్శించొద్దని, అందులో ఏమైనా లోటుపాట్లుంటే సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారు.
ఆరు నెలలపాటు టీవీ డిబేట్లకు కూడా దూరంగా ఉంటేనే మంచిదని కొంతమంది నేతలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నెల రోజులపాటు అందరూ చర్చలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చింది. తెలుగుదేశంలో కూడా ఆర్నెళ్ల నుంచి ఏడాదిపాటు అన్నీ అంశాలను నిశితంగా గమనించాలని భావిస్తున్నారు. విమర్శలు అంత మంచిదికాదని, వీటిని ప్రజలు హర్షించరని, ప్రభుత్వానికి సమయం ఇస్తే బాగుంటుందని పలువురు టీడీపీ సీనియర్ నేతలు అభిప్రాయపడినట్టు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు కేడర్ ను సిద్ధం చేయించటంతోపాటు సంస్థాగతంగా పార్టీని మరింత పటిష్టం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని హైకమాండ్ భావిస్తోంది. మంగళగిరిలో నిర్మిస్తోన్న పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. వేరే పార్టీ నేతలు తెలుగుదేశం ద్వితీయశ్రేణి నేతలను, గ్రామస్థాయి నాయకులను ఆకర్షించేందుకు వలసలకు ప్రోత్సహించే అవకాశం ఉందని, వీటిని కనిపెట్టుకుంటూ ఉండాలని నేతలను ఆదేశించారు.