స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి. సోమవారం కౌంటింగ్ జరగబోతోంది. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో అసలు టెన్షన్ ఇప్పుడు మొదలైంది. తమ క్యాంపులో ఉన్న ఓటర్లు తమకే ఓటు వేశారా.. లేక క్రాస్ ఓటింగ్ జరిగిందా అన్న చర్చ టిఆర్ఎస్ లో జరుగుతోంది. పార్టీలు మారినా..మెజార్టీ సభ్యులు… తమ పార్టీ వారేనని.. తమకే ఓటు వేశారని.. కాంగ్రెస్ అంటోంది.
టీఆర్ఎస్ అభ్యర్థులు మూడు ఎమ్మెల్సీ సీట్లను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రానికి దూరంగా ఓటు హక్కున్న అభ్యర్థులతో క్యాంపులు నిర్వహించి…వారి మంచి చెడులు అన్ని చూసుకున్నారు టిఆర్ఎస్ అభ్యర్దులు. పోలింగ్ కు ఒక రోజు ముందే మూడు జిల్లాల ఓటర్లను హైదరాబాద్ తీసుకువచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి క్యాంపునకు వెళ్లి ఓటర్లతో మాక్ పోలింగ్ నిర్వహించారు. ప్రతి ఓటరు గులాబీ పార్టీ అభ్యర్దుల గెలుపు కోసం కృషి చేయాలని ఆదేశించారు. ఓటింగ్ రోజు అభ్యర్థులు.. ప్రత్యేక వాహనాల్లో ఓటర్లను తీసుకెళ్లి మరి ఓటు వేయించుకున్నారు. మెజార్టీ ఓటర్లతో.. ఓట్లు వేయించుకున్నా… టీఆర్ఎస్కు మాత్రం టెన్షన్ తప్పడం లేదు.
గత అనుభవాల దృష్ట్యా టీఆర్ఎస్ నేతలు ఈసారి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వరంగల్, రంగారెడ్డికు చెందిన జడ్పిటిసి,ఎంపీటీసీ, కౌన్సిలర్లు,,కార్పొరేటర్లను ముందుగానే ఇతర రాష్ట్రాల్లో క్యాంపులకు తరలించారు . ఓటర్ల కుటుంబ సభ్యులకు కనీసం ఫోన్ లో అందుబాటులో లేకుండా చూశారు. ఇంత చేసినా ప్రతిపక్ష కాంగ్రెస్ ఎం చేసిందోనన్న అనుమానం గులాబీ పార్టీలో ఉంది. ఓటర్ల కుటుంబ సభ్యులను ప్రభావితం చేసి ప్రలోభాలకు గురిచేశాయేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఆర్దికంగా సామాజికంగా బలమైన అభ్యర్దులనే టీఆర్ఎస్ బరిలోకి దింపింది. 20 రోజులనుంచి క్యాంపులు నిర్వహించిన అధికార పార్టీ ఓటింగ్ ఎలా వేయాలో మాక్ పోలింగ్ కూడా విజయవంతంగా నిర్వహించింది. కానీ అసలు ఓటింగ్ లో మాత్రం మెజారిటీ సభ్యులు పోలింగ్ సరిగా వేయలేక పోయారని… టీఆర్ఎస్ నేతలు అంచనాకు వచ్చారు.
ఇప్పటివరకు ఓటర్లకు భారీగా ఖర్చు పెట్టి… వారి గొంతెమ్మ కోరికలు తీర్చిన అభ్యర్థులు.. ఇప్పుడు ఓటు సరిగా పడకపోయినా…లేక కాంగ్రెస్ అభ్యర్దులకు ఓట్లు వేస్తే తమ పరిస్థితి ఏంటని ఆందోళనలో వున్నారు టిఆర్ఎస్ అభ్యర్థులు. వరంగల్ ,రంగారెడ్డి జిల్లాలో టిఆర్ఎస్ అభ్యర్థులు కొంత జోష్ లో ఉన్నా…. నల్గొండ టిఆర్ఎస్ అభ్యర్థి మాత్రం టెన్షన్ లో ఉన్నారు. గత ఎన్నికలో కూడా తేరా చిన్నప రెడ్డి బలంగా ఉన్నా సొంత పార్టీ నుంచే క్రాస్ ఓటింగ్ జరిగడంతో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఈసారి కూడా రాజగోపాల్ రెడ్డి భార్య బరిలో ఉండటంతో ఆయన ఏం చేసి ఉంటారోనన్న ఆందోళన.. టీఆర్ఎస్లో ఉంది. వారంతా పాత ఓటర్లే కావడమే దీనికి కారణం.