జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై.. తెలంగాణ రాష్ట్ర సమితిలో టెన్షన్ ప్రారంభమయింది. నాలుగో తేదీన కౌంటింగ్ జరగనున్న తరుణంలో.. ఫలితాలు తేడా వస్తే.. ఎలా అన్న చర్చ ఊపందుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ వరకూ.. వారిలో… ఎలాంటి భయమూ లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలతో సహా మొత్తం 32 జడ్పీలను ఖరారు చేసుకుంటామన్న ఆత్మవిశ్వాసంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం.. పరిస్థితి మారిపోయింది.
32 జడ్పీలు కాదు మెజార్టీ గెల్చుకుంటామంటున్న టీఆర్ఎస్..!
స్థానిక సంస్థల ఎన్నికలు మే 6 నుంచి విడతల వారీగా మే 14 వరకు జరిగాయి. జూన్ 4 న ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ మళ్లీ తగులుతుందేమోననే ఆందోళన టిఆర్ఎస్ నేతల్లో నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 32 జడ్పీ పీఠాలు తామే కైవసం చేసుకుంటామని మొదటినుంచి చెప్పుకుంటూ వచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం కెటీఆర్ మాటతీరులో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల తెలంగాణ భవన్ లో మీడియాతో కెటీఆర్ చిట్ చాట్ చేశారు. పరిషత్ ఎన్నికల్లో సింహభాగం సీట్లు గెలుస్తామని చెప్పారే తప్ప 32 జడ్పీ పీఠాలు గెలుస్తామని చెప్పలేదు. అది టీఆర్ఎస్‌లో కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందనడానికి సూచికగా అంచనా వేస్తున్నారు.
ఆత్మవిశ్వాసంలో కాంగ్రెస్, బీజేపీ..!
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్…ఆ తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటింది. అనంతరం పార్లమెంట్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కారు సారు…పదహారు..సర్కార్ అనే నినాదంతో ముందుకెళ్లిన టిఆర్ఎస్….పదహారు పక్కా అని చెప్పినా….ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. తొమ్మిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ రిజల్ట్స్ తర్వాత మూడు నెలలలోపే ప్రజలు ఇలా తీర్పు ఇవ్వడంతో….పరిషత్ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే వస్తాయా అన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. 32 జడ్పీల సంగతేమో కానీ.. పరువు నిలబడాలని టీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు.
బేరసారాలు హైలెట్ కాబోతున్నాయా..?
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, బిజెపిలో జోష్ కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాతే పరిషత్ ఎన్నికలు జరగాయి. దీంతో పార్లమెంట్ లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి 10 జడ్పీ పీఠాలు కైవసం చేసుకుంటామని చెప్పుకుంటూ వస్తోంది. ఆ పార్టీ ఆ దిశగానే కసరత్తు చేసింది. అనుకున్న జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలవడంతో పాటు జడ్పీ పీఠాలను కైవసం చేసుకునేలా స్కెచ్ గీసింది. కనీసం పది స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పుకోస్తోంది కాంగ్రెస్. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సత్తా చూపుతామని బీజేపీ అంటోంది. ఫలితాల తర్వాత రెండు, మూడు రోజుల్లోనే జడ్పీ, ఎంపీపీల ఎన్నిక ప్రక్రియ ఉండే అవకాశం ఉంది.