నిన్ననే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ ఈ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ సందర్బంగా ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా స్పందించింది. అసాధ్యమన్న రాష్ట్రసాధనను సుసాధ్యం చేశామనీ, విడిపోతే అభివృద్ధి జరగదన్నవారి అభిప్రాయాలను తలదన్నేలా రాష్ట్రం దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఏమందంటే… రాష్ట్రం రూ. 2.60 లక్షల కోట్ల అప్పుల్లో ఉందనీ, ఆదాయం ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చింది కేసీఆర్ ఘనతే అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇక, భాజపా అభిప్రాయం ఏంటంటే… తెలంగాణలో మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం అపహాస్యం పాలౌతోందని లక్ష్మణ్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ విమోచన దినం గురించి కేసీఆర్ గొప్పగా మాట్లాడేవారనీ, తెరాస అధికారంలోకి వచ్చాక అధికారికంగానే విమోచన దినాన్ని నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారని లక్ష్మణ్ గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు సెప్టెంబర్ 17వ తేదీ ఊసెత్తడం లేదన్నారు. మజ్లిస్ పార్టీతో దోస్తీ పెట్టుకున్న దగ్గర్నుంచీ, ఆ పార్టీకి కేసీఆర్ తలొగ్గుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలన్నీ పక్కనపెట్టేసి, అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారనీ, రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండటం దారుణమని అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన దగ్గర్నుంచీ తెలంగాణ భాజపా నేతల మాటతీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సహాయ మంత్రి కిషన్ రెడ్డి మొన్ననే… కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా లక్ష్మణ్ కూడా తెలంగాణ విమోచన దినం పేరుతో పరోక్షంగా మజ్లిస్ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ విమోచన దినాన్ని తెర మీదికి తీసుకొచ్చి, రాష్ట్రంలో రాజకీయం చేయడానికి కావాల్సిన పునాదులను భాజపా వేసుకుంటున్నట్టుగా ఉంది. భాజపా విస్తరణ అంటే… వారికి కావాల్సిన అంశాలు ఇలాంటివే కదా! చేసిన అభివృద్ధి గురించిగానీ, మోడీ పాలనలో సాధించిన విజయాల గురించిగానీ ప్రజలకు చెప్పి పార్టీని విస్తరింపజేసుకునే స్థితిలో భాజపా ఎప్పుడైనా ఉందా… ఇప్పుడైనా ఉంటుందా అనేది అనుమానం?