విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద ఇప్పుడు .. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయన ఆశ్రమం గురించి.. ఆయన పూర్వాశ్రమం గురించి ఎన్నో రకల కథలు.. కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ… కళ్ల ముందు జరిగేదే నిజం కాబట్టి… ఆయనను ఇప్పుడు అత్యంత శక్తివంతమైన స్వామిగా నిర్ధారించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రెండో సారి గెలవగానే ముందుగా విశాఖ వచ్చి ఆయనకు సాష్టాంగ ప్రమాణం చేసి.. ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడా పని జగన్ చేయబోతున్నారు.
స్వరూపానంద సేవకు ఏపీ సీఎం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలో.. స్వరూపానంద డిసైడ్ చేశారు. ఆ ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు.. మంత్రి వర్గ విస్తరణ ముహుర్తం కోసం.. విశాఖ వెళ్తున్నారు. అధికార సమీక్షలతో బిజీగా ఉన్నప్పటికీ… తన కోసం పూజలు, హోమాలు చేసి.. అదే పనిగా.. ముహుర్తాలు పెట్టిన… స్వరూపానందను.. సీఎం హోదాలో దర్శించుకోవడం తన బాధ్యతని.. జగన్ అనుకున్నారు. అందులో భాగంగానే.. ఆయన.. మంగళవారం.. విశాఖ వెళ్లి.. స్వామి వారిని సేవించుకుని.. పూలు, పండ్లు సమర్పించుకుని.. మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ చేసుకోనున్నారు. పనిలో పనిగా తన గెలుపు కోసం.. తనదైన పద్దతిలో ప్రయత్నించినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పనున్నారు.
వైసీపీ నేతలతో కిటకిటలాడుతున్న స్వరూపానంద ఆశ్రమం..!
ఇప్పటికే స్వరూపానంద ఆశ్రమం.. రాజకీయ నేతల రాకపోకేలతో.. కిటకిటలాడుతోంది. వైసీపీ గెలిచినప్పటి నుంచి.. స్వరూపానంద ఆశ్రమానికి దాదాపుగా ప్రతీ రోజూ… ఇరవై మంది వరకూ ఎమ్మెల్యేలు వస్తున్నారు. తమకు తోచినంతగా… సేవ చేసుకుంటున్నారు. వెళ్లే ముందు మంత్రి పదవి దక్కాలని… ఆ మేరకు ఆశీర్వచనం తీసుకుంటున్నారు. గతంలో పెద్దగా భక్తులు లేకుండా.. కాస్త నిర్మానుష్యంగా ఉండే.. ఆశ్రమం.. ఇప్పుడు.. వైసీపీకి ప్రధానమైన ఆఫీసులా మారిపోయిందనే విమర్శలు… ఆ చుట్టుపక్కల ఉండే వారి నుంచి వస్తున్నాయి. అక్కడికి వచ్చి పోతున్న నేతల్ని చూస్తే.. చాలా మందికి అదే అనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నారు.
ఇద్దరు సీఎంలకు ఇష్టుడైన పవర్ ఫుల్ స్వామీజీ స్వరూపానంద..!
అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా… స్వరూపానందపై అమితమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆయన దోవలోనే.. జగన్మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడైనప్పటికీ.. హిందూత్వాన్ని ఆచరించేలా… చేశారనే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే జగన్.. తాను క్రైస్తవుడ్నేనని… పదవి చేపట్టిన తర్వాత కూడా పలుమార్లు నిరూపించుకున్నారు. అయినప్పటికీ.. స్వామి వారి సేవకు జగన్ ఏ మాత్రం వెనుకాడటం లేదు. మొత్తానికి స్వరూపానంద.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు.. ఇష్టుడైపోయారు. ఏ పని అయినా ఇట్టే చేయించగల సామర్థ్యాన్ని తెచ్చి పెట్టుకున్నారు.