ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన రవిప్రకాష్ కు అక్కడ కూడా చుక్కెదురైంది. రవి ప్రకాష్ ఇండస్ట్రీస్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే..
శ్రీనిరాజు వద్ద నుండి టీవీ9 కి చెందిన 90 శాతం వాటాను కొనుక్కున్న అలంద మీడియా తదితరులు, తమను టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పలు రకాలుగా ఇబ్బంది పెట్టాడని, సంస్థ ప్రయోజనాలను దెబ్బతినేలా, తన సొంత ప్రయోజనాల కోసం రవి ప్రకాష్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని, టీవీ9 లోగోని మోజో టీవీ యాజమాన్యానికి అమ్మి వేసే ప్రయత్నాలు చేశారని, ఒకనొక సందర్భంలో ఫోర్జరీ చేశాడని, ఇలా పలురకాల ఆరోపణలతో అలంద మీడియా రవిప్రకాష్ పై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి పరారీలో ఉన్న రవి ప్రకాష్ కోసం తాము పలు నోటీసుల జారీ చేసినప్పటికీ రవిప్రకాష్ నుండి స్పందన లేదని, తన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు ఆ మధ్య వివరించారు. అయితే ఈలోగా ఏదో ఒకలాగా ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగితే కనుక అరెస్టు జరగకుండా చూసుకోవచ్చు అని అనుకున్న రవిప్రకాష్ కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చినట్లయింది.
అయితే రవిప్రకాష్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టు వెళ్లాల్సిందిగా సూచించింది. అలాగే ఒకవేళ పోలీసులు రవి ప్రకాష్ ను అరెస్టు చేయాలంటే కనీసం 48 గంటల ముందు నోటీసు ఇవ్వాలని కూడా సూచించింది. ఇది రవిప్రకాష్ కు కాస్త ఉపశమనం కలిగించే మాటే. అయితే అదే సమయంలో, సెక్షన్ 41 కింద పోలీసులు నోటీసు ఇచ్చిన, రవి ప్రకాష్ ను పోలీసుల విచారణకు హాజరవ్వాలని కూడా ఆదేశించింది.