ఇవాళ్ల వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మూడింటా తెరాస విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫలితాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పరాజయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇది రాజగోపాల్ రెడ్డి ఖాళీ చేసిన స్థానం, దీంతో తన భార్యను నిలబెట్టారు. తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవడం కోసం కోమటిరెడ్డి సోదరులు చాలా తీవ్రంగానే కష్టపడ్డారు. భువనగిరి ఎంపీగా వెంకటరెడ్డి గెలవడంతో… ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని అనుకున్నారు. అయితే, ఇదే సమయంలో తెరాస కూడా కోమటిరెడ్డి సోదరులకు చెక్ పెట్టేందుకు తీవ్రంగానే కృషి చేసింది. చివరికి తెరాస పకడ్బందీ వ్యూహాన్ని ఛేదించడంలో కోమటిరెడ్డి సోదరులు వెనకపడ్డారనే సమాచారం ఇప్పుడు బయటకి వస్తోంది.
ఈ ఎన్నిక సందర్భంగా క్యాంపు రాజకీయాలు నడిచాయని సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నిక కోసం తెరాస కీలక నేతలంతా రంగంలోకి దిగారు. అంతేకాదు, ఇదే సమయంలో పార్టీకి చెందిన కొంతమంది సభ్యులను కోమటిరెడ్డి సోదరులు తమవైపునకు తిప్పుకుని, తమకు అనుకూలంగా ఓటు వేయించే ప్రయత్నాలు బాగానే చేశారట. కొంతమంది సభ్యులతో వారు టచ్ లోకి వెళ్తున్నారు అని తెలియగానే… తెరాస అప్రమైనట్టు సమాచారం. దీంతో, తెరాస సభ్యులందరినీ క్యాంపుకి తరలించారట. ఆ క్యాంపు నుంచి కూడా కొంతమందినైనా వీలైతే బయటకిలాగి, వారితో టచ్ లోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలూ తీవ్రంగానే ప్రయత్నించారని సమాచారం. అయితే, కోమటిరెడ్డి వ్యూహాలకు ధీటుగానే సభ్యులెవ్వరినీ ఆయనకి అందుబాటుకి వెళ్లనీయకుండా చేయడంతో తెరాస సక్సెస్ అయింది. ఫలితమే 226 ఓట్లు తేడాతో చినపరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు.
తెరాస క్యాంపు రాజకీయాలను కోమటిరెడ్డి సోదరులు ఛేదించలేకపోవడం వల్లనే ఆ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోలేకపోయిందన్నది కాంగ్రెస్ నేతల తాజా విశ్లేషణ. ఎంపీ స్థానాలు గెలవడంతో తెరాసపై తమదే పైచేయి కాబోతోందంటూ కోమటిరెడ్డి సోదరులు వ్యాఖ్యానాలు చేశారు. కానీ, ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరొకర్ని తెరాస ఓడించింది. దీంతో కోమరెడ్డి సోదరుల దూకుడుని మరోసారి తెరాస అడ్డుకున్నట్టే అయింది.