ఈరోజు ఫలక్నుమా దాస్ హీరో, దర్శకుడు విశ్వక్ మీడియా ముందుకు వచ్చారు. విజయ్ దేవరకొండ ఫాన్స్ కు తనకు మధ్య వార్ జరుగుతోంది అంటూ సోషల్ మీడియా తో పాటు కొన్ని చానల్స్ లో సైతం విపరీతంగా ప్రచారం జరగడంతో, తన ప్రెస్ మీట్ పై ప్రజలలో ఆసక్తి కలిగింది. ఇంతలోనే ఒక వీడియో బైట్ లో మాట్లాడుతూ, తన సినిమా పై విజయ్ దేవరకొండ ఫాన్స్ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ వచ్చాక మీడియా సమావేశం పెట్టి, ఈ ” ఛోటా ఛోటా బచ్చే” ( విజయ్ దేవరకొండ ఫాన్స్ నీ ఉద్దేశించి) అందరికీ సమాధానం ఇస్తానని, విశ్వక్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడడంతో, ఎపిసోడ్ మొత్తం మీద ప్రజల్లో ఆసక్తి కలిగింది. మొత్తం మీద మీడియా ముందుకు వచ్చిన విశ్వక్ మరొకసారి తన వివరణ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
వివాదం ఎక్కడ మొదలైంది:
గత వారం విడుదలైన ఫలక్నుమా దాస్ సినిమా కి విమర్శకుల నుండి పెద్ద ప్రశంసలు ఏమీ రాలేదు. కామన్ ఆడియన్స్ లో కూడా యూత్ వంటి ఒక వర్గం తప్పిస్తే మిగతా వర్గాల లో ఈ సినిమాపై పెద్ద ఆసక్తి ఏమీ లేదు. అయితే ట్రైలర్ లో చూపించిన కొన్ని డైలాగులు, ‘బీప్’ పదాల కారణంగా యువత లో ఈ సినిమాపై క్రేజ్ నెలకొన్న మాట వాస్తవమే. సినిమా చూసిన తర్వాత కూడా ఈ వర్గం నుండి ఒక మోస్తరు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన మాట కూడా వాస్తవమే. అయితే ఆ కలెక్షన్ల కారణంగా, విశ్వక్ సక్సెస్ తలకు ఎక్కించుకున్నాడని, సోషల్ మీడియా లో తన హ్యాండిల్ నుంచి బూతు పదాలతో కూడిన మెసేజ్లు పెట్టడం సబబు కాదని, నెటిజన్ల లో కొందరు విశ్వక్ మీద విరుచుకుపడ్డారు. ఇక అక్కడ్నుంచి తన సినిమా మీద విమర్శలు చేస్తున్న వారు విజయ్ దేవరకొండ ఫాన్స్ అన్న ప్రచారం వివాదాన్ని మరొక మలుపు తిప్పింది.
తన వీడియో బైట్ మీద విశ్వక్ వివరణ:
అయితే ఈ రోజు మీడియా ముందుకు వచ్చిన అనేక అంశాల మీద వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. బూతు పదాలను ఉపయోగించి పెట్టిన వీడియో మీద క్షమాపణ కోరాడు. అయితే తాను ఎవరినీ తిట్ట లేదని, ఆ వీడియో మొత్తం లో ఒక ఆరు సెకండ్ల భాగాన్ని పట్టుకొని కొందరు పనిగట్టుకుని వివాదం చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. ఆడియన్స్ ను కానీ నీ, సమీక్ష రచయితలను కానీ తాను తిట్టలేదనీ, అలా తిట్టడానికి తనకేమైనా పిచ్చా అని సమర్థించుకున్నాడు. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ సినిమా సక్సెస్ అయిందని, తన సినిమా సక్సెస్ను ఎవరు ఆపలేకపోతున్నారు అని వ్యాఖ్యానించాడు. తన సినిమాను ఎలాగైనా తొక్కేయాలని కొంతమంది చాలా ట్రై చేస్తున్నారు కానీ, వారి వల్ల కావడం లేదు అని అన్నాడు. సినిమాలు తొక్కేయడం కోసం నేను అనని మాటలను నాకు ఆపాదించి సినిమా మీద నెగటివ్ క్యాంపెయిన్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు అని విశ్వక్ వ్యాఖ్యానించాడు.
తన సినిమా కంటెంట్ మీద విశ్వక్ వివరణ:
ఇక సినిమాలోని కంటెంట్ మీద వస్తున్న విమర్శల పై కూడా స్పందించాడు. సినిమాలో బూతు డైలాగులు ఎక్కువ అయ్యాయని, ఈ సినిమా చిన్నపిల్లలను చెడగొట్టేలాగా ఉందని, చిన్నప్పటి నుండే గ్యాంగులు మెయింటెన్ చేయమని చిన్న పిల్లలకు ప్రబోధించే లాగా ఉందని, అలాగే 30 రూపాయల బోటీ కోసం గొడవ జరిగినట్లు గా చూపించే కొన్ని సీన్లు మరీ సిల్లీగా ఉన్నాయని వస్తున్న విమర్శల పైన కూడా స్పందించాడు. సినిమాలో 30 రూపాయలను బోటీ కోసం కొట్టుకున్నట్లు గా చూపించిన సీన్ ని మొన్నామధ్య వరంగల్లో జరిగిన ఒక పెళ్ళిలో 4 మటన్ ముక్కలు తక్కువ వచ్చాయని ఇరువర్గాలు తన్నుకుని, కొట్టుకుని పెళ్లి పందిరి పీకి అవతల పడేసిన సంఘటన ఆధారంగా రాసుకున్నానని చెప్పుకొచ్చారు. అలాగే ఇతర సన్నివేశాల గురించి మాట్లాడుతూ, లోయర్ మిడిల్ క్లాస్ జీవితాలలో జరిగే సంఘటనల ఆధారంగా కథ రాసుకున్నా అని చెప్పుకొచ్చారు. ఇక చిన్న పిల్లలను ఈ సినిమా చెడగొడుతుందని వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, నా సినిమా వల్ల ఏ పిల్లలు కూడా చెడిపోలేదని, సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి, తాను కూడా పిల్లలను ఈ సినిమా చూడవద్దని చెబుతున్నానని సమర్థించుకున్నారు.
ఏది ఏమైనా, అనుకోకుండా ఈ వివాదం వచ్చి సినిమాకి సాయ పడిందో, లేక ఉద్దేశ్యపూర్వకంగా తెలివిగా వివాదాన్ని అలా సృష్టించి సినిమాకు మైలేజ్ తెచ్చుకున్నారో తెలియదు కానీ, ఈ వివాదం వల్ల సినిమాకు బోలెడు పబ్లిసిటీ వచ్చిన మాట మాత్రం వాస్తవం.
– Zuran (@ CriticZuran)