తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ భవనాల అప్పగింత లాంఛనం కూడా పూర్తయిపోయింది. ఇఫ్తార్ విందు సందర్భంలో ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య చర్చలు జరగడం… అంతే వేగంగా జీవో కూడా వచ్చేయడం జరిగిపోయింది. భవనాల అప్పగింతలకు సంబంధించిన జీవోను గవర్నర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెలంగాణ సచివాలయానికి సంబంధించిన చర్చ తెర మీదికి వస్తోంది. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడంపై చాన్నాళ్లుగానే కొన్ని విమర్శలున్నాయి. కేసీఆర్ కి వాస్తు పరమైన నమ్మకాలు బాగా ఎక్కువనీ, ఇప్పుడున్న సచివాలయ భవనాలు ఆయన జాతకానికి అనుగుణంగా లేవనీ, కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తే తప్ప… ఆయన ఇక్కడికి రారనే అభిప్రాయం బలంగా వినిపించేది.
వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాలంటే ఏపీకి సంబంధించిన భవనాల నిర్మాణంలోనూ కొన్ని మార్చాల్సి వస్తుందనీ, ఆ కారణంతోనే ఇన్నాళ్లూ వాయిదా వేస్తూ వచ్చారనే అభిప్రాయమూ అప్పట్లో వినిపించేది. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఈ భవనాల విషయమై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయారు. ఇప్పుడు, కేసీఆర్ కి అనుకూలంగా ఉండే పార్టీ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చింది. కాబట్టి, ఏపీ భవనాలు కూడా తెలంగాణకు వచ్చేశాయి. అంటే, అదనంగా సెక్రటేరియట్లో మరిన్ని గదులు వాడుకునేందుకు వీలుంది. ప్రాక్టికల్ గా చూసుకుంటే కొత్త సెక్రటేరియట్ భవనం అవసరం లేదనే చెప్పాలి. అలాగని కొత్త భవన నిర్మాణం ఆలోచనపై కేసీఆర్ మనసు మార్చుకున్నట్టా అంటే.. అదీ చెప్పలేం!
సికింద్రాబాద్ లోని బైనస్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయం నిర్మించాలనే ప్రతిపాదన గతంలో కేసీఆర్ తీసుకొచ్చారు. ఆ గ్రౌండ్ కి సెక్రటేరియట్ నిర్మాణానికి ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఆ సమయంలో కాంగ్రెస్ తో సహా అన్ని విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా జనాల నుంచి ఓటింగ్ ద్వారా అభిప్రాయ సేకరణ కూడా చేసింది. ఇప్పుడు అదే అంశాన్ని తెర మీదికి తెస్తే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విమర్శలు తప్పవు. ప్రజాధనం వృథా వ్యయం అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మరోసారి విమర్శలు చేయడం ఖాయమే. అయితే, తెరాసకు మరో ఐదేళ్ల సమయం ఉంది. ఓ రెండేళ్లు గడిచాక… మెల్లగా ఈ అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. కేసీఆర్ వాస్తు నమ్మకాలు, జాతక చక్రాలు కాకుండా, కొత్త సచివాలయ నిర్మాణానికి మరో బలమైన కారణం ఏదైనా దొరికితే… వెంటనే ఆ పని తెరాస సర్కారు మొదలుపెడుతుందనడంలో సందేహం లేదు.