తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత, లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి… పొత్తు కొనసాగిస్తామని చెబుతూనే, పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంది. పార్టీ పెట్టిన తరువాత ఒక లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగకుండా దూరంగా ఉన్న పరిస్థితి తొలిసారిగా టీడీపీకి వచ్చింది! స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా ఆ పార్టీ సీరియస్ గా తీసుకోలేదు. తెలంగాణలో టీడీపీకి పెద్ద కొరత… నాయకులే. ప్రజల్లో పేరూ ప్రభావం ఉన్న నేతలంతా ఇతర పార్టీలకు తరలిపోయిన పరిస్థితి. 2014 తరువాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా టీటీడీపీ శాఖను పెద్దగా పట్టించుకోలేదు. అయితే… ఇంతా జరిగాక, ఇప్పుడు మరోసారి టీటీడీపీ వర్గాల్లో ఓ చర్చ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలను టీడీపీ విశ్లేషించుకుంటోందని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ, మల్కాజ్ గిరి, భువనగిరి స్థానాల్లో విజయం దక్కిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై టీడీపీ విశ్లేషణ ఏంటంటే… ఈ మూడు లోక్ సభ నియోజక వర్గాల్లో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ తో కలిసి పనిచేశాయని! తెరాస నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ తో పనిచేశాం కాబట్టే అధికార పార్టీకి ఢీ కొట్టామని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఎంపీల విజయాన్ని టీడీపీ శ్రమకు ఫలితంగానూ చూస్తున్నారు. కాబట్టి, భవిష్యత్తులో ఇదే తరహాలో పార్టీ తరఫున శ్రమిస్తూపోతే వచ్చే ఐదేళ్ల నాటికి రాష్ట్రంలో టీడీపీకి కొంత పట్టు లభిస్తుందనేది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ అభిప్రాయపడుతున్నారు.
ఈ ఉత్సాహంతోనే చాన్నాళ్లుగా వాయిదాపడ్డ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో మరోసారి ప్రారంభించే ఏర్పాట్లు రమణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ శాఖపై దృష్టి పెడతారనీ, వారంలో రెండు రోజులపాటైనా తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారని అంటున్నారు. కాబట్టి, పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందనే ధీమా టీటీడీపీ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది. నిజానికి, కాంగ్రెస్ ఎంపీల విజయంలో టీడీపీ విజయాన్ని చూసుకునే కంటే… రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు ఉన్న నిజమైన అవరోధాలపై సమగ్రమైన విశ్లేషణ చేసుకుంటే కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై కంటే, ఆంధ్రా టీడీపీ పార్టీపైనే చంద్రబాబు నాయుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఉంది కదా!