టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ హఠాత్తుగా పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసుల ముందుకు వచ్చిన ఆయన విచారణకు సహకరించారు. ఫోర్జరీ కేసులోరవిప్రకాష్ స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయాలంటే.. రెండు రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలని ..సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో.. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఆ కారణంగానే..రవిప్రకాష్ ఆజ్ఞాతం వీడి… పోలీసుల ఎదుటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి… విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తరుణంలో రవిప్రకాష్‌కు మరో ఆప్షన్ లేకపోయింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై .. హైకోర్టు పదో తేదీ లోపున నిర్ణయం తీసుకోనుంది. టీవీ9 వివాదం బయటకు వచ్చినప్పటి నుంచి రవిప్రకాష్ ఆజ్ఞాతంలోనే ఉన్నారు.
రవిప్రకాష్‌పై ఫోర్జరీ కేసు పెట్టిన రోజున.. ఆయన… సాయంత్రం టీవీ9 స్క్రీన్ పైకి వచ్చారు. తన వాదన వినిపించారు. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. ఆ తర్వాత మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు కేసులపై.. ఆయన ఓ వివరణ ఇస్తూ… వీడియో విడుదల చేశారు. అప్పట్నుంచి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆయనను పట్టుకునేందుకు పలు బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయని పోలీసు వర్గాలు చెప్పాయి.
చివరికి… ఆయనే విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు సినీ నటుడు శివాజీ మాత్రం పోలీసుల ముందుకు రాలేదు. శివాజీ పాత్ర పరిమితం కాబట్టి… ఈ విషయంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేస్తారని అంటున్నారు. మొత్తానికి టీవీ9 వివాదం..రవిప్రకాష్ విచారణకు హాజరవడంతోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.