భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతగిలింది. నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచినా… జడ్పీటీసీ ఆ స్థాయిలో సాధించలేకపోయారు. మండల పరిషత్ లోనూ… గెలవలేకపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ… పరిషత్ ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకుంది. కానీ ఇదే జోరును పరిషత్ ఎన్నికల్లో కొనసాగించడంలో పూర్తిగా విఫలమైంది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ దక్కించుకున్న స్థానాలు కనీసం మూడు శాతానికి కూడా మించలేదు. ఇదే ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగిన వెంటనే పోలింగ్ జరిగినా కమలం మాత్రం వికసించలేకపోయింది. 9 జిల్లాల్లో గెలిచిన ఎంపీటీసీ సీట్లు సున్నా కాగా… దాదాపు 16 జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 210 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇది స్వతంత్రుల కంటే తక్కువే..! స్వతంత్రులకు 570 స్థానాలు దక్కాయి. కనీసం మూడో స్థానంలో కూడా బీజేపీకి చోటు దక్కలేదు. ఇదే ఇప్పుడు బీజేపీ నేతలను కలవరపెడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోక్‌సభ స్థానాలు దక్కించుకున్నాయి. అయితే ఈ నియోజకవర్గ పరిధిలో కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కలేదు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. కానీ మే 6,10,14 తేదీల్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఎక్కడా కమలం జోరు కనిపించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఊపు ఊపిన కమలం.. స్థానిక ఎన్నికల్లో చతికిలపడటం హాట్ టాపిక్‌గా మారింది. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ 34 ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. కానీ టీఆర్ఎస్ ఏకంగా 186 సీట్లు దక్కగా… కాంగ్రెస్ 46 ఎంపీటీసీ స్థానాలు గెలిచింది.
కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం తర్వాత.. అదే జోరు పరిషత్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని భావించారు. కానీ ఎంపీటీసీ ఫలితాల్లో ఇక్కడ కమలం స్కోరు 15 మించలేదు. పార్లమెంట్ పరిధిలోని చాలా చోట్ల బీజేపీకి షాక్ తగిలింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రెండింట్లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ జెడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ ఖాతా తెరవలేదు. అయితే కేటీఆర్ నియోజకవర్గంలోని కుదురుపాక మండలంలో మాత్రం బీజేపీ ఓ ఎమ్పీటీసీ గెలిచింది. ఇదే బీజేపీ నేతలకు ఊరటనిస్తోంది. ఇదే ఇక్కడి నాయకులను షాక్‌కు గురి చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ 32 ఎంపీటీసీ స్థానాల్లో గెలిచింది. ఇక్కడ కమలానికి నాలుగు జెడ్పీటీసీలు కూడా దక్కాయి. నెల వ్యవధిలో జరిగిన ఎన్నికల్లో భిన్న తీర్పు రావడం హాట్ టాపిక్ అయింది.