విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన కేశినేని నాని.. ఆ పార్టీకి దూరంగా జరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితాలు వెలువడినప్పటి నుండి ఆయన బీజేపీ నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. నాగపూర్ వెళ్లి గడ్కరీని కలిశారు. విజయవాడలో చంద్రబాబు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఉన్నా.. ఢిల్లీలోనే ఉండిపోయారు. తాజాగా… సోషల్ మీడియాలో.. ఓ పోస్ట్ పెట్టి… తన ఉద్దేశం .. టీడీపీకి దూరంగా ఉండటమేనని… తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు.
అంత పెద్ద పదవులు భారం అవుతాయట..!
చంద్రబాబునాయుడు… కేశినేని నానికి… లోక్‌సభలో టీడీపీ ఉపనేత, విప్ పదవులు ఇస్తూ.. మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యనేతల సమావేశానికి ఆయనకు ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. అయినప్పటికీ.. చంద్రబాబు ఆయనకు పదవులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ… కేశినేని నాని మాత్రం… తన స్పందనను సోషల్ మీడియాలో తెలియజేశారు. తనకు ఆ పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారు. తనకు అంత పెద్ద పదవులు నిర్వహించే సామర్థ్యం లేదన్నట్లుగా.. సెటైరికల్ పోస్ట్ పెట్టారు. తన కంటే గొప్ప సామర్థ్యం ఉన్న వారికి.. ఆ పదవులు ఇవ్వాలని అధినేతకు వ్యంగ్యంగా సూచించారు.
ప్రాధాన్యత ఇవ్వలేదనే అలక..!
పార్లమెంటరీ పార్టీ నేత పదవి కోసం కేశినేని నాని ప్రయత్నించినట్లు సమాచారం. అది ఆయనకు దక్కలేదు. ఆ పదవిని చంద్రబాబు గల్లా జయదేవ్‌కు అప్పగించారు. లోక్‌సభలో.. పార్టీ నేత పదవిని రామ్మోహన్ నాయుడుకి ఇచ్చారు. దీంతో.. కేశినేని నాని తీవ్ర అసంతృప్తికి గురయినట్లు.. ఆయన పోస్టు ద్వారా తెలుస్తోంది. అప్పట్నుండి ఆయన.. టీడీపీ అధినేతను కలవడం లేదు. పార్టీ నేతలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు విజయవాడలో పార్టీ పరమైన కార్కక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. హాజరు కావడం లేదు.
విజయవాడ అభివృద్ధి కోసం బీజేపీలో చేరుతారా..?
తనను విజయవాడ ప్రజలు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకున్నారని… వారికి సేవ చేయడానికి తన సమయం అంతా వెచ్చిస్తానని… కేశినేని నాని చెప్పడం.. అనేక రకాల విశ్లేషణలకు కారణం అవుతోంది. పార్టీ మారేవాళ్లంతా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని చెప్పడం ఇటీవలి కాలంలో కామన్ అయిపోయింది. అలాగే.. కేశినేని నాని కూడా.. విజయవాడ కోసం.. తాను బీజేపీలో చేరుతున్నానని చెప్పే సూచనలు… ఆయన పెట్టిన సోషల్ మీడియాలో పోస్టులో ఉన్నాయన్న భావన కనిపిస్తోంది. మొత్తానికి ముందు ముందు కొంత కీలక రాజకీయమే కేశినేని కేంద్రంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.