ఇంటర్మీడియట్ బోర్డు తీరు ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. మొన్నటికి మొన్న పరీక్ష పత్రాలు దిద్దడంలో చూపిన నిర్లక్ష్య వైఖరి , అందులో జరిగిన అవకతవకల కారణంగా 20 మందికి పైగా విద్యార్థుల ఆత్మహత్యకు ప్రత్యక్షంగా కారణమైన ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరలేపింది. నాలుగు రోజుల్లో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ విషయంలో ఇంటర్మీడియట్ బోర్డ్ వైఫల్యం మరోసారి కనిపిస్తోంది. విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న ఇంటర్మీడియట్ బోర్డు వైఖరి కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కోసం తయారుచేయబడ్డ ప్రశ్నాపత్రాలను వరంగల్ లో 13 బాక్సుల్లో భద్రపరిచారు. అయితే ఇప్పుడు చూస్తే 13 బాక్సులలో కేవలం 11 బాక్సులు మాత్రమే ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. మిగతా రెండు బాక్స్‌లు ఎలా మాయం అయ్యాయి అనే విషయంపై ఇప్పటిదాకా ఎటువంటి సమాచారం లేదు. అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ మాత్రం, పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదని, ఆ 11 బాక్స్ లలో ఉన్న పత్రాలు విద్యార్థులకు సరిపోతాయని చెబుతున్నారు. పదవ తరగతి పరీక్ష పత్రాలను ఉంచిన గదిలోనే ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల బాక్స్ కూడా ఉండడంతో అవి మాయమై ఉండవచ్చని వారంటున్నారు.
అయితే విద్యార్థులలో మాత్రం ఈ అంశం పట్ల ఆందోళన నెలకొంది. ఆ రెండు బాక్స్‌లు మాయమవ్వడం అంటే పరీక్షా పత్రం లీక్ అయినట్లేనని వారంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మరొకసారి పరీక్ష వాయిదా వేస్తారు ఏమోనన్న ఆందోళన కూడా విద్యార్థులలో నెలకొంది. ఇన్ని సంఘటనలు జరిగినా, ఇంటర్మీడియట్ బోర్డు కి సిగ్గు రావడంలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వం కూడా ఇది ఇంటర్మీడియట్ బోర్డు సమస్య అంటూ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండకుండా, స్వయంగా జోక్యం చేసుకొని ఇంటర్మీడియట్ బోర్డు ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు కోరుతున్నారు.