తెలంగాణ జన సమితి… ప్రస్తుతం వార్తల్లో కూడా వినిపించడం లేదు! గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలతో కలిసి కూటమిలో భాగంగా పోటీ కోదండరామ్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం నాలుగు సీట్లలో మాత్రమే పోటీ చేసినా, ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయారు. వాస్తవానికి, పార్టీని మరింత పటిష్ట పరుచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల తరువాతి నుంచి జన సమితి పార్టీ కార్యకలాపాలేవీ పెద్దగా లేవు. కానీ, ప్రజల తరఫున తాము పోరాటం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని కోదండరామ్ అంటున్నారు. ప్రస్తుతం హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే, అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచారు. దీంతో అక్కడ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవుతోంది. కాబట్టి, అక్కడి నుంచి కోదండరామ్ బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే ప్రతిపాదన తెరమీదికి తెచ్చినట్టు సమాచారం.
హుజూర్ నగర్ నుంచి పోటీకి దిగాలంటూ సొంత పార్టీకి చెందినవారే కోదండరామ్ పై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, అక్కడ ఎన్నికలకు దిగితే పరిస్థితి ఎలా ఉంటుందా అనే అంశంపై సన్నిహితులతో కోదండరామ్ చర్చిస్తున్నట్టు సమాచారం. హుజూర్ నగర్ లో పోటీకి దిగితే… తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా జనసమితి పార్టీపై అటెన్షన్ వస్తుందనీ, అక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే… పార్టీకి కొత్త ఉత్సాహం రావడం ఖాయమనీ, పార్టీ విస్తరణకూ పనికొస్తుందని పార్టీ వర్గాల్లో అభిప్రాయంగా తెలుస్తోంది.
అయితే, ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అనేది మరచిపోకూడదు! ఉత్తమ్ సొంత ఇలాఖా. ఆయన లేకపోతే ఆ కుటుంబానికి చెందినవారిని నిలబెట్టుకుంటారు. అంతేగానీ, దీన్ని కోదండరామ్ కోసం త్యాగం చేస్తారా..? హజూర్ నగర్ ఉప ఎన్నిక మీద తెరాస కూడా చాలా ఆశలు పెట్టుకుంది. ఉత్తమ్ సొంత నియోజక వర్గంలో గులాబీ జెండా ఎగరేయడానికి సర్వశక్తులూ మోహరించి మరీ ఉప ఎన్నికను ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… కోదండరామ్ పోటీకి దిగడం సాధ్యమా అనేది ప్రశ్న? ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తును కాదనుకుని… తెరాస వెర్సెస్ కాంగ్రెస్ మధ్య జరిగే ఉప పోరులో కోదండరామ్ సొంతంగా నిలబడ్డా కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇలాంటి సమయంలో పోటీ గురించి ఆలోచించే కంటే… మరో నాలుగేళ్ల విజన్ తో పార్టీ నిర్మాణంపై దృష్టిపెడతే మంచిది.