తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలక మండళ్లను రద్దు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. తొలి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, రద్దు చేయాలనుకుంటే ముందస్తుగా నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా నోటీసులు ఇయ్యాల్సి వస్తే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో జగన్ సర్కారు ఉందని తెలుస్తోంది. ఈనెల 8వ తేదీన మంత్రి వర్గం ఏర్పాటు ఉంటుందని తెలిసిందే. అదే రోజున కేబినెట్ భేటీ పెట్టి, వెంటనే పాలక మండళ్ల రద్దుపై ఆమోదింపజేయాలని భావిస్తున్నారు. ఆ తీర్మానాన్ని వెంటనే గవర్నర్ కు పంపించాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని సమాచారం.
ఒకవేళ, కేబినెట్ లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే సమయం లేకపోతే… ఈనెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తొలి సమావేశాల్లోనే ఈ అంశాన్ని సభ ఆమోదంతోనైనా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వినిపిస్తోంది. అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టాల్సి ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది.
నిజానికి, ప్రభుత్వం మారిన వెంటనే… ఆలయాల పాలకమండళ్లలో మార్పులు అనేది సహజమే. ఇప్పటికే తితిదే పాలక మండలకి సంబంధించిన సభ్యులు కొంతమంది రాజీనామాలు చేశారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం ద్వారా వైకాపాకి చెందిన కొంతమంది నాయకులతో కొంత పాలక మండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. నిజానికి, నోటీసులు ఇచ్చి రద్దు చేయాల్సి ఉన్నా…. ఒకవేళ ఏదైనా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కోర్టులో దాఖలైతే… పాలక మండళ్ల అంశం కోర్టు పరిధిలోకి వెళ్లిపోతుంది. కోర్టు ఏదో ఒకటి తేల్చే వరకూ కొత్త నియామకాల్లాంటివి సాధ్యం కాదు కదా. అందుకే, ఆర్డినెన్స్ తేవాలనేది జగన్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.