తెలంగాణ పల్లెల్లో… ఎదురులేదని నిరూపించుకున్న టీఆర్ఎస్.. ఇక పట్టణాల్లోనూ కారు జోరేనని ముద్ర వేయాలని అనుకుంటోంది. కేసీఆర్.. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. మామూలుగా అయితే… అన్ని ఎన్నికలను వరుసగా నిర్వహించి ఆ తర్వాత పాలనపై దృష్టి పెట్టాలనుకున్నారు. అయితే.. లోక్సభ ఎన్నికల్లో తగిలిన షాక్తో.. మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేద్దామనుకున్నారు. కానీ.. వెంటనే పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో.. మనసు మార్చుకున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మారింది. లోక్ సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడంతో మున్సిపల్ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవాలని భావించారు. కానీపరిషత్ ఎన్నికల్లో బంపర్ విజయంతో మున్సిపల్ ఎన్నికలు వెంటనే పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. తెలంగాణాలో మున్సిపాలిటీల పదవీకాలం జూలై మొదటి వారంలో ముగుస్తోంది. ముందుగా గడువులోగానే ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు సీఎం కేసీఆర్. కానీ లోక్ సభ ఫలితాల్లో ఎదురుదెబ్బ తగలడంతో… ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే టిఆర్ఎస్ కు నష్టమని భావించారు. అందుకే ప్రజల మూడ్ లో మార్పు వచ్చేంత వరకు ఎన్నికలు నిర్వహించరాదనే అభిప్రాయానికి వచ్చారని తెలిసింది.. కానీ ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికల ఫలితాలతో వ్యూహం మార్చుకున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయ.
పరిషత్ ఎన్నికలు టిఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ను పునరావృతం చేసాయి. 32 జడ్పీ పీఠాలను దక్కించుకోవడమే కాకుండా కొన్ని జిల్లాల్లో ప్రతిపక్షాలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ఫలితాలతో తిరిగి టిఆర్ఎస్ లో ధీమా పెరిగింది. రాష్ట్రం విషయానికి వచ్చే సరికి ప్రజలు తమతోనే ఉన్నారనే అభిప్రాయానికి వచ్చింది.. దీంతో ప్రజల మూడ్ తమకు అనుకూలంగా ఉన్న ఈ సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే గులాబీ జెండాకు ఎదురుండదని భావిస్తున్నారు. ఇదే హవా మున్సిపాలిటీల్లో కొనసాగించవచ్చనే నిర్ణయానికి వచ్చారు.
మున్సిపల్ ఎన్నికలు ఎక్కువ సమయం వాయిదా వేయకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నారు. నెలాఖరులోగా కొత్త మున్సిపల్ బిల్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అసెంబ్లీ నిర్వహించి చట్టం చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ నిర్వహణకు ఆలస్యమైతే ఆర్డినెన్స్ జారీ చేసైనా ఎన్నికలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఎక్కువ సమయం వాయిదా వేయకుండా రెండు మూడు వారాల తేడాతో ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సర్కార్ ఉంది.