జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే కొనసాగనున్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లో ఆదరణ సంపాదించాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఊహించని ఫలితాలు రావడంతో.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని అధినేత నిర్ణయించారు. దాని కోసం ఓ కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచే.. రంగంలోకి దిగుతున్నారు.
ముందుగా సమీక్షలు.. ఆ తర్వాత కదనరంగంలోకి..!
పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జనసేనానే పార్టీకి అన్నీ తానై నడిపించారు. ఇక నుంచి జిల్లాల వారీగా నాయకత్వాన్ని బలోపేతం చేసి ఆయా ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలతో ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు జనసేన సిద్దమవుతుంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆకర్షించేలా జనసేన కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తుంది. పవన్ కళ్యాణ్ జిల్లాల్లోని ముఖ్యనాయకులు, అభిమానులతో సమావేశాలు నిర్వహించి తన ఉద్దేశాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. ఈ సమావేశాలు పూర్తయిన అనంతరం.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ పార్టీ నేతలతోనే కాకుండా.. స్థానికులు, గ్రామ పెద్దలతో కూడా పవన్ సమావేశమవుతారు. ఇక
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమే ప్రథమ కర్తవ్యం..!
ప్రతి ఎన్నికలలో జనసేన పోటీ చేయడమే కాకుండా.. గెలుపోటములతో సంబంధం లేకుండా.. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం అడుగులు వేయాలని పవన్ నిర్ణయించుకున్నారు. అంశాల వారీగా ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపడం.. అదే విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, జనసేన పార్టీ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై ఎక్కువుగా దృష్టి పెట్టాలని క్యాడర్ కు పవన్ సూచిస్తున్నారు. దీనికి సంబంధించి.. పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
సినిమాలు చేసే చాన్సే లేదని చేతల్లో చెబుతున్నారా..?
జిల్లాల వారీ సమీక్షలకు నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు. ముందుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నేతలతో పవన్ సమీక్షా నిర్వహిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఆయా ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను బట్టి అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారు. జనసేన పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత చాలా మంది… ఇక పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటారని అనుకున్నారు. కొన్ని కాంబినేషన్ల పేరులోత.. వార్తకు బయటకు వచ్చాయి. కానీ… అదేమీ లేదని.. తన దృష్టి అంతా రాజకీయాల మీదేనని పవన్ కల్యాణ్.. నిరూపించేందుకు సిద్ధమయ్యారు.