తెలుగు360 రేటింగ్: 2/5
పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టడం కాదు, రీలు చుట్టండి అనుకున్నాడు కథకుడు, నిర్మాత రమేష్ వర్మ. అందుకే ఓ పిచ్చి ప్రేమను కథగా మార్చి, ఆపై దానికి ధ్రిల్లర్ హంగులు జోడించి, సినిమా తీసి జనాల మీదకు వదిలాడు. అదే ఈవారం విడుదలయిన 7 (సెవెన్). ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి వెరసి ఏడుగురు. అదే టైటిల్ అర్థం, పరమార్థం.
ప్రేమ కాస్తా పిచ్చిగా మారిపోయిన ఓ అమ్మాయి పాత్రను డిజైన్ చేసుకుని, ఆ పిచ్చిని ప్రతీకారంగా మార్చి, ఆ ప్రతీకారం కోసం ఓ లాజిక్ లకు అందని అతుకుల బొంతలాంటి కథ అల్లిన వైనమే సెవెన్ సినిమా.
ఒక్క షో పడితే చాలు సినిమాలో విషయం ఎలాగూ బయటకు వస్తుంది కాబట్టి కథను కాస్త వివరించడం పాపమే కాదు, తప్పూ కాదు. ఒకళ్ల తరువాత ఒకళ్లుగా ముగ్గురు అమ్మాయిలు పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ భర్తలు మాయమయ్యారని ఫిర్యాదు చేస్తారు. ఇక్కడ ట్విస్టేంటంటే, ఆ ముగ్గురు చెప్పే భర్త ఒక్కడే. అతడే కార్తీక్ (హవీష్). పోలీస్ ఆఫీసర్ (రెహమాన్) ఈ కేసును అంతర్జాతీయ టెర్రరిస్ట్ కోసం గాలించిన, పరిశోధించిన రేంజ్ లో పరిశోధిస్తాడు. సదరు కార్తీక్ అన్నవాడు దొరుకుతాడు. కానీ ఈ ముగ్గురూ ఎవరో తనకు తెలీదు అంటాడు. కానీ వేరే అమ్మాయి వచ్చి, వాడు నా మొగుడే అంటుంది. అనడం కాదు. తుపాకితో కాల్చి చంపే ప్రయత్నం చేస్తుంది. ఏమిటి ఇదంతా అని జనం జుట్టు పీక్కుని, సస్సెన్స్ తో కిందా మీదా అయిపోతుంటే, ఓ ముసలి పాత్రతో మొత్తం ముడి విప్పిస్తాడు దర్శకుడు. అదేంటీ అనేది కూడా చెప్పేస్తే సినిమాకు కథేం మిగలదు.
థ్రిల్లర్ సినిమాలకు పాయింట్ బేస్ చేసుకుని, కథ రాసుకోవడం వరకు బాగానే వుంటుంది. కానీ దాన్ని తెరమీదకు అనువదించడమే కత్తి మీద సాము. గ్రిప్ పోకూడదు, అలా అని సాగదీసినట్లు వుండకూడదు. కమర్షియల్ సినిమాల సంగతి ఎలా వున్నా, ఈ ధ్రిల్లర్ సినిమాల్లో మాత్రం ప్రతి నటుడు పాత్రలో ఒదిగిపోవాలి. అప్పుడే ప్రేక్షకుడు కుర్చీ అంచున కూర్చుని సినిమా చూస్తాడు.
సెవెన్ సినిమాకు ఇవేవీ సమకూరలేదు. కథకుడు ఓ పాత్రను ఊహించి, దానికి ప్రేమ, ప్రతీకారాలు జోడించడం వరకు బాగానే వుంది. కానీ దాని కోసం తయారుచేసిన రెండో ప్లాట్ మాత్రం దెబ్బతింది. నిజానికి కథకుడు ఊహించిన రెండు ప్లాట్లు ఒకదానితో ఒకటి మిక్స్ అయ్యేవి కావు. దానికి తోడు దెయ్యం సినిమాకు వెదకరు కానీ, థ్రిల్లర్ సినిమాలకు జనాలు లాజిక్కులు వెదుకుతారు.
కథకుడు రమేష్ వర్మ మలిసగంలో అసలు కథను వుంచి, దాని కోసం అల్లిన థ్రిల్లర్ కథను తొలిసగంలో చూపించాడు. ఇక్కడి వరకు ఆలోచన బాగానే వుంది. కానీ అలా అల్లిన కథ పూల్ ఫ్రూఫ్ గా వుండాలని కానీ, చిత్రీకరణ ఆసక్తికరంగా సాగాలని కానీ, నటీనటుల దగ్గర నుంచి సరైన నటన రాబట్టాలని కానీ అస్సలు అనుకున్నట్లు కనిపించదు. అనిపించదు.
సినిమా ఎత్తుగడ బాగానే సాగుతుంది. హీరో ప్రేమ కథ వన్ స్టార్ట్ అయ్యే వరకు దర్వకుడే అందించిన సినిమాటోగ్రఫీ పుణ్యమా అని సినిమా కాస్త ఎంగేజింగ్ గా వుంటుంది. హీరో స్క్రీన్ మీదకు వచ్చిన లగాయతు ఫస్ట్ మిస్ కాస్ట్ అన్న పాయింట్ ప్రేక్షకుడి ఆలోచనలోకి రావడం ప్రారంభమవుతుంది. కాస్త గ్యాప్ తరువాత తెర మీదకు వచ్చిన హవీష్ నటనలో మినిమమ్ బేసిక్స్ మరిచిపోయినట్లు కనిపిస్తుంది. ప్రేక్షకులు అతని హావభావాలు, డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ కారణంగా సన్నివేశాలతో డిస్ కనెక్ట్ అయిపోతారు. దానికి తోడు సన్నివేశాల్లోకి ఫీల్ లేదా సోల్ తీసుకురావడం అన్నది దర్శకుడు నజర్ షఫీ కి సాధ్యం కాలేదు. తొలిసినిమా అన్నది అక్కడ తెలిసిపోతుంది. ఆఫీసు సీన్లు అన్నీ పక్కా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి.
ఇలా సినిమా ఫస్ట్ హాప్ ముగించుకుని, సెకండాఫ్ లోకి వచ్చాక కూడా పెద్దగా వేగం పుంజుకోదు. ఎప్పుడయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రారంభమవుతుందో అప్పుడు సినిమా కాస్త ఎంగేజింగ్ గా, చూడాలనిపించేలా మారుతుంది. అక్కడి నుంచి క్లయిమాక్స్ వరకు ఒకే వేగంతో వెళ్తుంది, కానీ మేకర్లు ఇక్కడ చేసిన ఓ కీలకమైన తప్పు, సినిమాను గట్టిగా పట్టి కిందకు లాగేసినట్లు అయింది. ఆ తప్పు ఎందుకు చేసారన్నదానికి మేకర్లే సమాధానం చెప్పాలి. నిజానికి సినిమాకు కీలకమైన విషయం అదే. సినిమాకు ప్లస్ కూడా అయ్యేది. ఇప్పుడు ఎంత అద్భుతమైన నటన చూపించినా, సీన్ పండినా కూడా ప్రేక్షకులకు అదంతా ఓ ఫన్ మాదిరిగా వుంటుంది తప్ప, పాత్ర మీద సింపతీ రాదు.
ఇక లాజిక్ ల విషయానికి వస్తే, ముగ్గురు హీరోయిన్లు ఓకే ఆఫీస్ లో పనిచేస్తూ వున్నపుడు ఒకరు మరొకరికి తెలియకపోవడం, ఆ ముగ్గురిలో ఇద్దరు హీరోకి తెలియకపోవడం చిత్రంగా వుంది. అలాగే పిచ్చివాడి పాత్ర, ఆ మర్డర్ రెండూ లాజిక్ కు దూరంగా వున్నాయి. అన్నింటికి మించి ముగ్గురు అమ్మాయిలు తమ జీవితాలను పణంగా పెట్టి నాటకం ఆడడం అన్నది సినిమాటిక్ వ్యవహారం తప్ప వేరు కాదు.
ఇలాంటి సినిమాకు నేపథ్యసంగీతం. సినిమాటోగ్రఫీ బాగానే సమకూరాయి. దానివల్ల నిర్మాణ విలువలు బాగానే వున్నాయి అన్న భావన కలుగుతుంది. నటీనటుల్లో ఒక్క రెజీనాకు, వృధ్దురాలిగా నటించిన నటికి తప్ప మరెవరికీ పెద్దగా మార్కులు పడవు. హీరోయిన్లు అందరికీ పెద్దగా చేయడానికి స్కోప్ వున్న పాత్రలు దొరకలేదు. హీరోగా హవీష్ పాపం, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రధాన సమస్య అతని డిక్షన్. సంభాషణలు అతని గొంతులో చాలా పేలవంగా పలుకుతున్నాయి. హెయిర్ స్టయిల్ కూడా సరిగ్గా నప్పలేదు. ఆ లెక్కన చూసుకుంటే గతంలో అతను చేసిన సినిమాలే బెటర్ అనిపిస్తాయి.
ఫినిషింగ్ టచ్…ప్రేమ..పిచ్చి..ప్రతీకారం
తెలుగు360 రేటింగ్: 2/5
-శ్రీవత్స