“రూ. 10వేల కోట్లు కాదు.. రూ. 20వేల కోట్లు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేటాయిస్తాం. ముఖ్యమంత్రి పదవి కాపులకు ఇచ్చేయండి..!” ఇదీ .. కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని.. ప్రకటించి.. ఏడాదికి రూ. 2వేల కోట్ల చొప్పున కాపులకు ఫండ్ ఇస్తామన్నప్పుడు.. ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు.. రాజకీయం అయిపోయింది. ఎన్నికలు అయిపోయాయి. తీరా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తాను చెప్పిన ఆ రూ. 10వేల కోట్లకు ముద్రగడను బాధ్యడ్ని చేయబోతున్నారు. అంటే పార్టీలో చేర్చుకుని కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారట.
గోదావరి జిల్లాల్లో వైసీపీకి కాపు ఓట్లు పడటం వెనుక ముద్రగడ..!
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం మొన్నటి ఎన్నికల వేళ అనూహ్యంగా మౌనం వహించారు. కాపు వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ కే మద్దతుగా నిలుస్తారని కొంత మంది. . కేంద్రం ఆమోదించిన అగ్రవర్ణ పేదలకు ఇచ్చే రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు ఇవ్వడంతో వారంతా చంద్రబాబు వైపే ఉంటారని మరి కొందరు అంచనా వేసారు. అయితే, అనూహ్యంగా కాపుల్లో అధిక శాతం వైసీపీ వైపే మొగ్గు చూపారు. నిజానికి జగన్ కాపులను దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయలేదు. కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని తేల్చడంతో పాటు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించారు. అయినా కాపు వర్గం ఓట్లు వైసీపీకి బాగానే పడ్డాయి. దీనికి ముద్రగడ సహకారం ఉందని అంటున్నారు. వైసీపీ కోసం ఆయన లోపాయికారీగా పని చేశారని ప్రచారం జరిగింది.
కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజ్యసభ పదవి ఆఫర్ ఇచ్చిన వైసీపీ..!
కాపు ఓటు బ్యాంక్‌ను సుస్థిరం చేసుకునేందుకు… వైసీపీ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా ముద్రగడను అధికారంగా పార్టీలో చేరాలని ఆహ్వానించింది. చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వ్యక్తిగతంగా తీవ్ర అవమానాల పాలు చేసారని….దానికి విరుగుడు కోరుకుంటున్నట్టు వైసీపీ నేతలకు ముద్రగడ చెప్పినట్లు సమాచారం. అందుకే ముద్రగడకు కాపు కార్పొరేషన్ పోస్ట్ .. దానికి ఏడాదికి రూ. 2వేల కోట్ల బడ్జెట్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టారు. అంతే కాకుండా వచ్చే టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా వైసిపి తరుపున పార్లమెంట్ కు పంపుతామని పద్మనాభం కు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఈ ప్రతిపాదనపై ముద్రగడ సానుకూలంగానే ఉన్నారని అంటున్నారు.
కాపుల్ని ఓటు బ్యాంకుగా చేసుకోవడమే జగన్ లక్ష్యం..?
టీడీపీ..జనసేనలకు కాపు వర్గాన్ని పూర్తిగా దూరం చేసేందుకే జగన్ ఈ ఆపరేషన్ చేపట్టారంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన తమకు అడ్డుగా మారొచ్చనీ, దానికి విరుగుడు ఇదేనని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. పైగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ప్రయోగం తరవాత కాపులకు స్వంతంగా అధికారం అనే కల చెదిరిపోయిందనీ….వాళ్ళు ఇకపై ఏదో పక్షాన నిలవాల్సిందేననీ…అది వైసీపీనే అయ్యేలా చూడాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారంటున్నారు. ముద్రగడను వైసీపీకి గూటికి చేర్చే క్రమంలో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. త్వరలోనే ముద్రగడ.. వైసీపీలో చేరడం ఖాయమే.