ఏపి ప్రభుత్వంలో భాగస్వామిగా, తెదేపాకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి చెందిన కొందరు రాష్ట్ర నేతలు ప్రభుత్వానికి పక్కలో బల్లెంలాగ తయారయ్యారు. వారిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ కూడా ఒకరు. ముఖ్యమంత్రిని విమర్శించేవారిలో ఆయన ప్రప్రధములుగా ఉంటారు. ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి ఆయన బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. అవసరమయితే తను కూడా ఆయనతో కలిసి పోరాడుతానని చెపుతున్నారు.
ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలననే ఉద్యమించవలసి వచ్చిందని అన్నారు. ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేస్తునందుకు కాపులపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. కాపులు మంచివాళ్ళని చెపుతూనే మళ్ళీ వారిపై కేసులు ఎందుకు పెడుతున్నారని కన్నా లక్ష్మి నారాయణ ప్రశ్నించారు. అవసరమయితే నేను కూడా జైలుకి వెళ్లేందుకు వెనుకాడను అని చెప్పారు. ఆయన బీజేపీలో ఉండటంతో తెదేపా నేతలు ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఏదో ఒకరోజు ఆయనపై కూడా ఎదురుదాడి చేయవచ్చును.