ఫేస్ బుక్ లో ఎంపీ కేశినేని నాని “పోరాడితే పోయేది ఏమీలేదు.. సంకెళ్లు తప్ప” అంటూ తన ఎకౌంట్ లో కామెంట్స్ చేస్తూ పోస్టింగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాని పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ పోరాటం కొనసాగించాలని కొంతమంది ఫేస్‌బుక్ లో కామెంట్స్ పెడుతున్నారు. దీంతోనే తాను స్పందించానని నాని.. అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అంతకుమించి తనకేటువంటి ఉద్దేశంలేదని చెబుతున్నారు. నాని పార్టీని వీడతారని, అందువల్లే ఇటువంటి కామెంట్స్ ను ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్టింగ్ చేస్తున్నారనేది కొందరు పార్టీ నేతల మాట.
పార్టీ మారే అంశాన్ని ఎంపీ కేశినేని నాని కొట్టి పారేస్తున్నారు. మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ తమ అధినేత .. వైసీపీలో చేరితే తాను బీజేపీలో చేరతానని సరదాగా వ్యాఖ్యానించారు. పార్టీలో జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు అధినేత దృష్టికి తీసుకెళ్లడం, వాటిని సరిచేయటం, పార్టీలో ప్రజాప్రతినిధిగా, కార్యకర్తగా తన కర్తవ్యమని గుర్తుచేస్తున్నారు. టీడీపీ పరాజయం పాలైనప్పటికీ ఇప్పుడే అన్ని రకాల విశ్లేషణలు చేసుకొని పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు నడవాల్సిన బాధ్యత తెలుగుదేశం నేతలు, కార్యకర్తలందరిపై ఉందని నాని అనుచరుల దగ్గర చెబుతున్నట్టు తెలుస్తోంది.
లోక్ సభకు తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందిన ముగ్గురు ఎంపీలకు పదవులు ఇచ్చే విషయంలో ఏర్పడిన వివాదం కొనసాగుతూనే ఉంది. పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు, లోక్ సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడుకు పదవులను కేటాయించారు. గల్లా జయదేవ్ తల్లి అరుణకు పార్టీ పొలిట్ బ్యూరో, ఆమె కుమారుడుకు లోక్ సభ పార్టీ నాయకత్వ పగ్గాలు అప్పగించడంపై కూడా ఎంపీ కేశినేని నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గల్లా జయదేవ్ పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాలన్నీ నేరుగా బుధవారం సాయంత్రం అధినేత చంద్రబాబు ముందే నిర్మోహామాటంగా తన మనసులోని మాటను చెప్పారు. పదవుల విషయంలో పునరాలోచిద్దామని చంద్రబాబు చెప్పినప్పటికీ, నాని మాత్రం తాను విప్ పదవిని తీసుకోనని తెగేసి చెప్పారు.
కొసమెరుపేమిటంటే.. పోరాడితే పోయేదేం లేదు…బానిస సంకెళ్లుతప్ప.. అని కొటేషన్.. శ్రీశ్రీ రాసినట్లు గా కేశినేని పోస్ట్ చేశారు. కానీ అసలు ఆ స్ఫూర్తిదాయక మాటలు రాసింది కారల్ మార్క్స్ అని.. చాలా మంది నెటిజన్లు.. గుర్తు చేశారు. సెటైర్లు వేశారు.