తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోయినట్టే అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై టి. కాంగ్రెస్ లో మిగులున్న నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విలీనానికి నిరసనగా శనివారం ఉదయం నుంచి 36 గంటలపాటు నిరసన దీక్ష చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమౌతున్నారు. విలీన ప్రక్రియపై ఈరోజు హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు కేసులో ఉన్నారనీ, పార్టీ అధ్యక్షుడి అభిప్రాయంతో సంబంధం లేకుండా విలీన ప్రతిపాదనను ఎలా ముందుకు తీసుకెళ్తారని ఉత్తమ్ అంటున్నారు. ఈ విలీనం వల్ల తెలంగాణ సమాజానికే మంచిది కాదన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్న మార్గం.. న్యాయ స్థానాన్ని ఆశ్రయించడమే. ఒక జాతీయ పార్టీకి చెందిన శాసన సభా పక్షాన్ని విలీనం చేయడం సాంకేతికంగా సాధ్యమా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ విలీనంపై కాంగ్రెస్ హైకమాండ్ నేతలు కూడా ఈరోజు స్పందించనున్నట్టు సమాచారం. నిజానికి, ఈ విలీన ప్రక్రియను రెండు నెలల కిందటే తెరాస ప్రారంభించింది. అదే సమయంలో హైకోర్టును మల్లు భట్టి విక్రమార్క ఆశ్రయించారు. అయితే, విలీన ప్రక్రియ ప్రారంభమయ్యాక తమను ఆశ్రయించాలనీ, ముందస్తుగా తమను ఆశ్రయించొద్దని అప్పట్లో కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడా సమయం వచ్చింది. కాబట్టి, ఇప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఒకవేళ అధికార పార్టీ తీరును తప్పుబడుతూ… కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినా, దాన్ని స్పీకర్ అమలు చేస్తారా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకమే. ఎందుకంటే, గత తెరాస హయాంలో కూడా కోర్టు ఆదేశాలను సభాపతి అమలు చేయని అనుభవాలున్నాయి. సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం కోర్టుకు అంతకుమించి లేదు. అయితే, దాదాపు ఇదే తరహా పరిస్థితి ఆ మధ్య తమిళనాడులో వచ్చింది. అన్నాడీఎంకేపై కొంతమంది సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. వారిపై హైకోర్టే అనర్హత వేటు వేసింది. ఆ తీర్పును సవాలు చేస్తే… హైకోర్టు తీర్పునే సర్వోన్నత న్యాయస్థానం కూడా సమర్థించింది. దాంతో ఎమ్మెల్యేలు పదవులను కోల్పోయి… ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంశం కూడా అంతవరకూ వెళ్తుందా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న మార్గమైతే… కోర్టును ఆశ్రయించడమే.