పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కోటిగా అమలు చేయడంపై దృష్టిపెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర సమయంలో పోలీసులు, హోంగార్డులు తమకు వారాంతపు సెలవు ఉండేలా చేయాలంటూ కోరారు. వైకాపా అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేస్తామనీ, పోలీసుల సంక్షేమంపై దృష్టిపెడతానని జగన్ మాటిచ్చారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ఇచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని సీఎం జగన్ నియమించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీక్లీ ఆఫ్ ఇచ్చే విషయమై అధ్యయనం చేసేందుకు 22 మందితో ఒక కమిటీని డీజీపీ సవాంగ్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఐజీలు, డీజీలు, ఎస్పీలు, కమాండెంట్లు, కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ కమిటీ పోలీసులకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ అధ్యయనం చేస్తుంది. ఏయే విభాగాల్లో ఏయే రోజుల్లో వీక్లీ ఆఫ్ లు అమలు చేయాలి, సెలవు ఇవ్వడం వల్ల ఆ రోజు బాధ్యతల్ని ఇతరులకు ఎలా సర్దుబాటు చెయ్యాలి, సిబ్బంది తక్కువగా ఉన్న విభాగాల్లో పరిస్థితి ఏంటీ… ఒకరోజుపాటు బాధ్యతల్ని ఇతరులకు బదలాయించడంలో ఉన్న సాంకేతికపరమైన సమస్యలేంటి… ఇలా అన్ని కోణాల్లో ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. దీనికి సంబంధించిన తుది నివేదికను వారం రోజులుగా ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా వారాంతపు సెలవుపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నిజానికి, పోలీసులకు వీక్లీ ఆఫ్ కచ్చితంగా ఇవ్వాలనే ప్రయత్నాన్ని గత టీడీపీ సర్కారు కూడా చేసింది. అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు నేతృత్వంలో వారాంతపు సెలవులు అమలు కోసం ప్రయత్నించారు. ప్రయోగాత్మకంగా కొద్దిరోజులు అమలు చేసినా, దాన్ని టీడీపీ ప్రభుత్వం కొనసాగించలేకపోయింది. సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. అందుకే, ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యయనం చేశాకనే పక్కాగా నిర్ణయం తీసుకోవాలన్నది జగన్ సర్కారు ఆలోచన. పోలీసులకు వారాంతపు సెలవు కచ్చితంగా అమలు చేయగలిగితే… ఆ కుటుంబాలు ఎంతో సంతోషిస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే, పోలీసులు షిప్టులవారీగానే పనిచేస్తుంటారు. వీక్లీ సెలవు అనేది వారికి దాదాపు అసాధ్యం. ఎన్నికల్లాంటి సందర్భాలొస్తే… ఆ షిప్టులు కొనసాగుతూనే ఉంటాయి. ఏడాదికి 15 సీఎల్స్ ఉన్నా కూడా… వాటిని పూర్తిగా వాడుకోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో కుటుంబంతో వారంలో ఒకరోజు కూడా పూర్తిగా గడపలేని పోలీసులు చాలామంది ఉన్నారు. వారాంతపు సెలవును పక్కాగా అమలు చేస్తే… ఆ కుటుంబాలు సంతోషిస్తాయనడంలో సందేహం లేదు. అంతేకాదు, వారంలో రోజు విశ్రాంతి ఉంటే, పని ఒత్తిడి తగ్గి, మిగతారోజుల్లో వారి పనితీరుపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది.