For Part 1 click:
https://www.telugu360.com/te/janasena-review-meeting-about-the-mistakes-done-in-2019-elections-part-1/
మీడియా బలం లేకపోవడం ప్రధాన ప్రతికూలాంశం:
2009 ఎన్నికలు వచ్చిన రోజు సాయంత్రం ప్రజారాజ్యం క్యాడర్ అంతా చిరంజీవిని బలంగా కోరిన అంశం ఏమిటంటే ఒక ఛానల్ పెట్టమని అడగడం. అయితే అప్పట్లో చిరంజీవి- ఛానల్ ఉన్నంత మాత్రాన అధికారంలోకి వస్తామని భావించకూడదని, ఛానల్ లేకపోయినా అధికారంలోకి రావచ్చునని వారికి హితవు పలికారు. 2019 వచ్చేసరికి, సోషల్ మీడియా ప్రాబల్యం బాగా పెరగడంతో, ప్రధాన పార్టీలు చేసే ఆరోపణలని సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తిప్పికొడుతూ ఉండడంతో, మీడియా అవసరం లేదని పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన నాయకులు కూడా భావించారు. అయితే సొంత మీడియా లేకపోతే, ఆఖరి రెండు నెలల్లో ప్రత్యర్థి మీడియా చేసే ఆరోపణలను తిప్పి కొట్టడం ఎంత కష్టం అన్న సంగతి ఈ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కి అర్థమై ఉండాలి.
నిజానికి బలమైన మీడియా తోడు ఉండి ఉన్నట్లయితే, పవన్ కళ్యాణ్ చేసిన చాలా ప్రయోగాలు ప్రజల్లోకి వెళ్లి ఉండేవి. ఉదాహరణకి, పవన్ కళ్యాణ్ ఎంతో మంది సామాన్యులకు, ప్రజాసేవలోనే దశాబ్దంపైగా పనిచేస్తున్న వ్యక్తులకు ఒక్క రూపాయి పార్టీ ఫండ్ తీసుకోకుండా టికెట్ ఇచ్చారు. ఇలాంటివన్నీ ఏదైనా అగ్ర పత్రికలో కానీ, అగ్ర ఛానల్ లో ప్రైమ్ టైం లో చర్చ కి గానీ వచ్చి ఉంటే గనక, ప్రజల్లో దాని ప్రభావం ఖచ్చితంగా కనిపించి ఉండేది. మీడియా తోడు ఉండడానికి, మీడియా తోడు లేక పోవడానికి తేడా ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పొచ్చు- ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే చాలామంది ఉద్దానం సమస్యను వెలుగులోకి తీసుకు వచ్చాడని, ఆ సమస్య బాధితులకు ప్రభుత్వ పక్షాన సహాయం దొరికేలా చేశాడని చెబుతూ ఉంటారు. ఎందుకంటే, అప్పట్లో పవన్ చేసిన ఆ ప్రయత్నానికి మీడియా సహకారం ఉంది. అలాగే ఆ తర్వాత అరకు గిరిజన ప్రాంతాలలో స్వయంగా చాలా రోజులపాటు బస చేసి, అక్కడి ప్రజలతో వారి సమస్యల గురించి చర్చించి, వారితో పాటు మమేకమైన సంగతి చాలా మందికి తెలియదు, కారణం దాదాపు అన్ని మీడియా చానల్స్ ఆ సంఘటనని ప్రజలకు తెలియ నివ్వ కుండా చేయడమే.
మొదటి దశలో జరిగిన ఎన్నికలు శరాఘాతం లా మారడం:
Click here:
https://www.telugu360.com/te/analysis-on-janasena-political-strategies/
పవన్ కళ్యాణ్ 2014లో మార్చి 14న పార్టీ పెట్టి , మే లో జరిగిన ఎన్నికల ఫలితాలను మార్చగలిగాడు. బహుశ అదే నమ్మకంతో, 2019లో కూడా లాస్ట్ ఓవర్ లో గేమ్ మార్చివేయవచ్చు అన్న భరోసా తో ఉన్నట్లు కనిపించింది. అయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ కి మొదటి విడతలోనే ఎన్నికలు జరగడం తో, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిననాడే ఇది జనసేనకు శరాఘాతంగా మారబోతోందని చాలామంది రాజకీయ విశ్లేషకులు ఊహించారు. జనసేన లో ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు ఎంపిక జరుగుతూ ఉండటం, అసలు నామినేషన్ ఆఖరి రోజు లోపు అన్ని నియోజకవర్గాల కి అభ్యర్థులు ఖరారు అవుతారా లేదా అన్న ఆందోళన కూడా ఒకానొక సమయంలో జనసేన అభిమానులకు కలగడం జరిగింది.
అయితే 2014 నుండి 2018 వరకు ఈ నాలుగేళ్లలో పార్టీ నిర్మాణం మీద దృష్టి సారించకుండా, కేవలం ఆఖరి ఏడాది పార్టీ నిర్మాణం చేయబూనడం, అది కూడా పూర్తిస్థాయిలో చేయలేకపోవడం, కేవలం ప్రచారంలో తాను మాట్లాడే మాటల ప్రభావంతో ఓటర్లు మనసు మార్చుకుంటారని భావించడం ( అది కూడా , 2014లో లాగా మీడియా మద్దతు తనకు ఇప్పుడు లేదని తెలిసి) పార్టీ ఫలితాల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపినట్లు గా అర్థం అవుతోంది.
దిద్దుబాటు చర్యలు:
ఏ రంగంలోనైనా విఫలం కావడానికి పలు రకాల కారణాలు ఉండవచ్చు కానీ, తిరిగి సక్సెస్ కావడానికి మాత్రం దిద్దుబాటు చర్యలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. అదే – బ్యాక్ టు బేసిక్స్. ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి కావలసిన కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ ఫాలో అయితే, విజయానికి అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఒక రాజకీయ పార్టీగా జనసేన తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు కూడా చాలా బేసిక్ అంశాలే. మొదటిది, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్ ని ఏర్పరచుకోవడం. రెండవది, తమ వాణీ ప్రజల్లోకి స్పష్టంగా వెళ్లే లాగా మీడియా పరమైన వ్యూహం ఏర్పరచుకోవడం, లేదా స్వంత మీడియా ఏర్పరచుకోవడం. రాజకీయ పార్టీకి సొంత మీడియా కచ్చితంగా అవసరం అని చెప్పలేం కానీ, మిగతా పార్టీలకు మీడియా బలం ఉన్నప్పుడు వాటికి సరితూగే మీడియా బలం మనకి లేకపోవడం ఖచ్చితంగా ప్రతికూల అంశమే అవుతుంది. మూడవది, నిరంతరంం ప్రజల్లో ఉంటూ, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేయడం. అయితేేేే ప్రజల పక్షాన పోరాటం చేసినా, తగిన మీడియా బలం లేకపోతే, ఆ పోరాటాలు చేసిన విషయం కూడా ప్రజలకు తెలియకుండా పోతుంది. ప్రజల పక్షాన పోరాటం చేసి, మీడియా బలం ఉన్నా కూడా, క్షేత్రస్థాయిలో క్యాడర్ బలం లేకపోతే ఎలక్షనీరింగ్ స్థాయిలో విఫలం అయి ప్రజా మద్దతు ఓట్లుగా మారకుండా పోతుంది. కాబట్టి, ఈ మూడు అంశాల్లోనూ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపడితే, కచ్చితంగా తదుపరి ఎన్నికలలో పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
– జురాన్ ( @CriticZuran)