తెలుగు మీడియా రంగంలో మరో టీవీ చానల్ యాజమాన్యం సైలెంట్‌గా మారిపోయింది. మొదట్లో కాస్త వయోలెంట్‌గా వ్యవహారాలు ప్రారంభమైనా.. గంటల్లోనే.. దాన్ని సైలెంట్ చేయగలిగిన.. పవర్ ఫుల్ వ్యాపారవేత్తలు..మోజో టీవీని పూర్తిగా తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆ వ్యాపారస్తులు మోజో టీవీని తమ చేతుల్లోకి తీసుకున్న వైనం.. ఇప్పుడు మీడియా రంగంలో కలకలం రేపుతోంది. వారు అత్యంత శక్తివంతమైన మనుషులు కాబట్టి.. ఎవరూ బయట మాట్లాడటానికి సిద్ధపడలేకపోతున్నారు. అందుకే..మోజో టీవీ వ్యవహారం.. గుట్టుగా సాగిపోతోంది.
మోజో టీవీ బోర్డులోకి రెండు వారాల్లో నలుగురు కొత్త వ్యక్తులు..!
మోజోటీవీకి చైర్మన్, ఫుల్ టైమ్ డైరక్టర్ గా చేరెడ్డి హరికిరణ్ ఉండేవారు. ఆయనే దీన్ని స్థాపించారు. 2016 డిసెంబర్ 21న మీడియా ఎన్‌ఎక్స్‌టీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా మోజోటీవీని ప్రారంభించారు. ఆ తర్వాత సీఈవోగా.. పొగడదండ రేవతిని తీసుకుని.. ఆమెకు డైరక్టర్ హోదా ఇచ్చారు. వారే .. ఈ చానల్‌ను ఇప్పటి వరకూ నడిపారు. అయితే హఠాత్తుగా.. గన రెండు వారాల సమయంలో.. ఏకంగా నలుగురు కొత్త డైరక్టర్లు చేరారు. మే పదో తేదీన కాలేపు గోపీ కృష్ణ,… ఆ తర్వాత మాధవరపు వంశీ కృష్ణ అనే వ్యక్తిని అడిషనల్ డైరక్టర్ గా ఇరవై ఐదో తేదీన చేర్చారు.. మే 31వ తేదీన కూడా గౌడుగడ్డం కృష్ణ అనే వ్యక్తిని మరో అదనపు డైరక్టర్ గా చేర్చారు. ఈ డైరక్టర్లంతా… కొత్త యాజమాన్యానికి చెందిన వారన్న ప్రచారం జరుగుతోంది.
రామేశ్వరరావు కబ్జా చేస్తున్నారని ఆరోపించిన సీఈవో రేవతి..!
నిజానికి ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు.. అంటే.. మే 22వ తేదీన… సీఈవో అండ్ డైరక్టర్ రేవతి.. తమ చానల్‌ను.. మైహోం ఇండస్ట్రీస్ అధినేత రామేశ్వరరావు కబ్జా చేయబోతున్నారని ఆరోపణలు చేశారు. రాత్రి సమయంలో.. బ్రేకింగ్ న్యూస్‌తో హడావుడి చేశారు. మీడియాపై మాఫియా దాడికి తెగబడుతోందన్నారు. అయితే.. కాసేపటికే.. మోజో టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. అప్పుడే ఏవో కేసులతో.. రేవతిని ఆ చానల్ యాంకర్ రఘుని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగింది. తర్వాత ఏం జరిగిందో కానీ..మోజో టీవీలో అలాంటి వార్తలు కనిపించలేదు. న్యూస్ ప్రయారిటీ కూడా మారిపోయింది.
టీవీ మీడియాపై రామేశ్వరరావు పట్టు సాధించేశారా..?
అప్పటికే.. మోజో టీవీ చైర్మన్ హరికిరణ్ చేరెడ్డిని పోలీసులు తీసుకెళ్లి బెదిరించారని… పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని.. ఉచితంగా.. మోజో టీవీ వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసుల విచారణకు హాజరైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కూడా అదే చెప్పారు. అదే సమయంలో.. మోజో టీవీ యాజమాన్యం మారిపోయింది. అచ్చంగా.. టీవీ9 తరహాలోనే లావాదేవీలు జరగడంతో… కొత్త డైరక్టర్లు అంతా.. రామేశ్వరరావుకు సంబంధించిన మనుషులేనని భావిస్తున్నారు. అదే నిజమైతే… రామేశ్వరరావు.. తెలుగు మీడియాపై పట్టు సాధించినట్లే. ఇప్పటికే టెన్ టీవీ, టీవీ 9లను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మోజో టీవీ కూడా సొంతమైంది. ఎన్టీవీలోనూ పెట్టుబడులు ఉన్నాయి.