ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చే ప్రసక్తే లేదని.. బీజేపీ.. ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కుండబద్దలు కొట్టి తేల్చి చెప్పేశారు. ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ.. తొమ్మిదో తేదీన తిరుపతికి వస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా.. ప్రోటోకాల్ ప్రకారం.. ప్రధానికి స్వాగతం చెప్పనున్న ఏపీ సీఎం జగన్… ప్రత్యేకహోదా అంశం గురించి వినతి పత్రం అందిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే…కన్నా లక్ష్మినారాయణ.. ముందుగానే.. అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని.. తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా కావాలని జగన్ అడిగితే మాకు అభ్యంతరం లేదని అయితే.. అదే అంశంపై జగన్ ప్రధానిని కలిసినా లాభం లేదని కన్నా తేల్చేశారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్ని నిధులు కావాలన్నా ప్రధాని తప్పక ఇస్తారని.. హోదా విషయంలో ఇక ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. ప్రత్యేకహోదా విషయంలో గత ప్రభుత్వం బీజేపీపై దుష్ర్పచారం చేసిందన్నారు. ఎన్ఆర్జీఎస్ కింద ఏపీకి కేంద్రం వేల కోట్ల నిధులు ఇచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేకహోదా విషయంలో.. కేంద్ర ప్రభుత్వంపై పోరాడే పరిస్థితిలో లేరు. గెలిచిన తర్వాత ఆయన మోడీని మొదటి సారి కలిసినప్పుడు… వచ్చే ఐదేళ్లలో… ప్రత్యేకహోదా విషయంలో .. తన విధానమేంటో చెప్పకనే చెప్పారు. ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అని బతిమాలుకుంటే… ఎప్పుడో ఓ సారి వస్తుందని చెప్పారు. అంటే… ఆయన పోరాడే పరిస్థితి లేదు. ఇప్పుడు కన్నా చెప్పిన దాని ప్రకారం… అలా ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అంటూ ఇచ్చే దరఖాస్తులన్నీ బుట్టదాఖలవుతాయి. అయితే.. ఫలితాలు వచ్చిన మొదటి రోజుల్లో.. జీవీఎల్ నరసింహారావు ఏపీకి వచ్చి… ఇప్పటికైతే ప్రత్యేకహోదా వ్యవస్థ లేదు… భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేమంటూ… ప్రకటించి… వారికి రెండో ఆలోచన ఉందేమో.. అన్న అభిప్రాయాన్ని కల్పించారు. కానీ కన్నా మాత్రం నిర్మోహమాటంగా హోదా గురించి మాట్లాడవద్దంటున్నారు.
మరో వైపు.. ఇరవైకిపైగా సీట్లు గెలిపిస్తే.. హోదా తీసుకొచ్చి చూపిస్తామన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు. .బతిమాలడం తప్ప మరేమీ చేయలేమన్న భావన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ మాత్రం… పైకి ఏమీ అనకపోయినా… హోదా అంశాన్ని మెల్లగా… పట్టాలెక్కించాలనే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఉన్న అతి స్వల్ప ఎంపీలతోనే.. పార్లమెంట్లో ప్రత్యేకహోదా కోసం గళమెత్తితే… వైసీపీ నేతలు కూడా.. దిగిరాక తప్పదని… పోరాటం చేయక తప్పదని.. టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే.. ఆరు నెలల పాటు సైలెంట్‌గా ఉండి… ఆ తర్వాతే తమ కార్యాచరణ ప్రారంభించాలనుకుంటున్నారు.