మంత్రి వర్గ విస్తరణలో ఓ కొత్త సంప్రదాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అనొచ్చు. సాధారణంగా, మంత్రి వర్గంలో ఖాళీ ఉన్న స్థానాలన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా… ఒక దఫా కొన్ని పదవులు ఇచ్చి, కొన్నాళ్ల తరువాత అసంతృప్తులూ బుజ్జగింపులూ లాంటివి లెక్కేసుకుని… మరో దఫా విస్తరణకు ఆస్కారం ఉండేలా చూసుకుంటారు. కానీ, జగన్ దీనికి పూర్తి భిన్నమైన తరహాలో మంత్రి వర్గ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటించిన మంత్రి వర్గంలో దాదాపు 90 శాతం మందిని రెండున్నరేళ్ల తరువాత మార్చాల్సి ఉంటుందనేది ముందుగానే స్పష్టం చేసేశారు. దానికి మానసికంగా సిద్ధం ఉండాలని కూడా కాబోయే మంత్రులకు తేల్చి చెప్పేశారు.
వైయస్సార్ ఎల్పీ సమావేశంలో సీఎం జగన్ చాలా సూటిగా స్పష్టంగా నాయకులతో మాట్లాడారు. ఎవరైతే తనతోపాటు పార్టీ ఏర్పాటు నుంచి ఉన్నారో, పార్టీ నమ్ముకుని త్యాగాలు చేసి గెలిపించేందుకు తోడ్పడ్డారో… అలాంటి వారందరికీ న్యాయం చేస్తానన్నారు. అందరికీ ప్రాధాన్యత, గుర్తింపు తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించేవారు దాదాపు 30 నెలలపాటే బాధ్యతల్లో ఉంటారు, ఆ తరువాత రొటేషన్ పద్ధతిలో కొత్తవారికి ఆయా శాఖల బాధ్యతలను అప్పగిస్తానని చాలా స్పష్టంగా సీఎం చెప్పారు. ఇప్పుడు పదవులు తీసుకున్నవారంతా.. ఆ తరువాత, పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కీలకంగా ఉండేలా చూస్తాననీ చెప్పేశారు. అంటే, జగన్ సర్కారు పదవీ కాలంలో దాదాపు 40 నుంచి 45 మందికి మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కనుంది.
ఇలా రొటేషన్ విధానంలో పదవులు అనేది సాధారణంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉంటాయి. కానీ, ఎక్కువమందికి అవకాశం కల్పించడం కోసం కొత్త తరహా పద్ధతిగా జగన్ దీన్ని తెరమీదికి తెచ్చారు. ఇలా 30 నెలలే పదవీ కాలం అని ముందే చెప్పడం వల్ల ఆయా మంత్రుల పనితీరు కూడా మొదటి రోజు నుంచీ చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. పనితీరు అద్భుతంగా ఉంటే… అలాంటివారిని రెండో దఫాలో కూడా మంత్రిగా కొనసాగించే అవకాశమూ పరిశీలనలో ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు కదా! ఓరకంగా ఇది మంచి ప్రయోగంగానే కనిపిస్తోంది. పార్టీపరంగా చూసుకుంటే… ఇప్పటికిప్పుడు పదవులు దక్కనివారు అసంతృప్తికి లోనయ్యే అవకాశం లేదు. రెండున్నరేళ్ల తరువాత అవకాశం ఉంటుందని ఆశ ఉంటుంది. పదవి వచ్చింది కదా అని కాస్త రిలాక్స్ అయ్యే పరిస్థితి దక్కినవారికీ ఉండదు! తామేంటో వెంటనే నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది!