జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో… కచ్చితంగా చోటు దక్కుతుందని భావించిన వారి పేర్లు కనిపించలేదు. ఇందులో జగన్మోహన్ రెడ్డి నేరుగా పదవి ఇస్తానని హామీ ఇచ్చిన వారు కొందరైతే.. ప్రజల ముందు .. బహిరంగంగా హామీ ఇచ్చిన వారు మరికొందరు. ఇంకొందరు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంటనే తిరుగుతూ … ప్రతిపక్షంలో ఉండిపోరాడారు. అలాంటి వారికి ఇప్పుడు పరిస్థితి… ఇబ్బందికరంగా మారింది.
రోజాకు బెర్త్ ఎలా మిస్సయింది..?
జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో… నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు… కచ్చితంగా.. అతి ముఖ్యమైన శాఖతో.. మంత్రి పదవి లభిస్తుందని… వైసీపీ గెలవక ముందు నుంచే ప్రచారం ఉంది. ఎందుకంటే.. ఆమె తెలుగుదేశం పార్టీపై.. తీవ్ర స్థాయిలో పోరాడారు. అసెంబ్లీలో సస్పెన్షన్లను ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను.. చివరికి టీడీపీ అధినేతను కూడా.. వ్యక్తిగత స్థాయిలో దూషణలను విమర్శలుగా చేసి కలకలం సృష్టించారు. ఇలాంటి పరిస్థితుల‌్లో… రోజాకు.. బెర్త్ ఖాయమని చెప్పుకున్నారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఆమెను పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు బెర్త్‌లు కూడా ఖాళీ లేవు కాబట్టి.. మరో రెండున్నరేళ్ల వరకూ అవకాశం లేదు. మరో నామినేటెడ్ పదవి ఏదైనా ఇచ్చినా.. అవి మంత్రి పదవి ముందు దిగదుడుపే కాబట్టి.. కంటితుడుపే అనుకోవాలి.
ఆళ్ల, మర్రిలకు ఇచ్చిన మాట ఏమయింది..?
వైసీపీ అధినేత ఎన్నికల ప్రచారంలో భాగంగా… ప్రజలకు నవరత్నాల హామీలే కాదు.. కొంత మందిని గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని ప్రచారం చేశారు. అలాంటి వారిలో… నారా లోకేష్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలుకలూరిపేట టిక్కెట్ త్యాగం చేసిన మర్రి రాజశేఖర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి… బెర్త్ దొరికింది. కానీ.. ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌లకు మాత్రం జగన్ మొండి చేయి చూపారు. లోకేష్‌పై ఆళ్లను గెలిపిస్తే.. ఆయనను మంత్రిని చేస్తానని ఎన్నికల ప్రచారంలో.. ఆ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన జగన్… చివరికి రెండున్నరేళ్ల తర్వాత చూద్దామనుకున్నారు. మర్రి రాజశేఖర్ విషయంలో.. అసలు టిక్కెట్టే ఇవ్వని… జగన్.. మంత్రి పదవి ఇస్తారని ఎలా ఆశలు పెట్టుకుంటారని… వైసీపీలోనే సెటైర్లు పడుతున్నాయి. అయితే.. వీళ్లకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జగన్ కు రెండున్నరేళ్ల తర్వాత అవకాశం ఉంది.
సూపర్ సీనియర్లకు నిరాశే..!
వైసీపీలో కొంత మంది సూపర్ సీనియర్లు ఉన్నారు. వీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు. ఆయన ప్రభుత్వంలో… కీలక పాత్ర పోషిచిన వారు. అలాంటి వారిలో.. ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి లాంటి వాళ్లు ఉన్నారు. ధర్మాన సోదరులు ఇద్దరూ గెలిచారు. ఇందులో.. మొదటి నుంచి తనతో పాటు నడిచిన ధర్మాన కృష్ణదాస్‌కు జగన్ చాన్సిచ్చారు. తమ్ముడు ప్రసాదరావును పక్కన పెట్టారు. నెల్లూరు నుంచి ఆనం సీనియార్టీని జగన్ పరిగణనలోకి తీసుకోలేదు. అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డికే ప్రయారిటీ ఇచ్చారు. ఆనం… కొన్నాళ్ల క్రితమే… పార్టీలో చేరడం.. మేకపాటి … మొదటి నుంచి తనతోనే ఉండటంతో.. వారికి అవకాశం కల్పించారు.
ఆ ఇద్దరూ అదృష్టవంతులే..!
వైసీపీ.. ఏపీలో ఓడిపోయింది.. 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే. వాటిలో ఒకటి రేపల్లె. మరొకటి.. మండపేట. ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. వీరు విధేయంగా జగన్ వెంట ఉండటమే అవకాశాలు దక్కించుకోవడానికి కారణం. పిల్లి సుభాష్.. గతంలో మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. మోపిదేవి.. అక్రమాస్తుల కేసుల్లో జైలుకెళ్లి వచ్చారు. వీరిద్దరికి జగన్… విధేయత కోణంలో… పట్టం కట్టారు..!