ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ ఏర్పాటులో రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా అవకాశం ఉన్న 25 మందితో ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. అంటే.. ఒక్క మంత్రి పదవి కూడా ఖాళీ ఉండదు. సాధారణంగా… ఏ ప్రభుత్వం అయినా… కొన్ని ఖాళీలను అట్టి పెట్టుకుంటుంది. కనీసం రెండు అయినా పెండింగ్ పెడుతుంది. ఎందుకంటే.. అది రాజకీయ వ్యూహం. పదవులు దక్కలేదని.. నిరాశకు గురయ్యేవారికి ఆ రెండు పదవులు ఊరిస్తూ ఉంటాయి. విస్తరణ అంటూ జరిగితే.. తమకే చాన్స్ వస్తుందని.. వారు సహనంతో ఉంటారు. ఇప్పటి వరకూ.. అదే జరిగింది. కానీ.. జగన్మోహన్ రెడ్డి.. ఈ పద్దతిని మార్చేస్తున్నారు. మొత్తం కేబినెట్లో ఉన్న 25 ఖాళీలను ఒకే సారి భర్తీ చేస్తున్నారు.
రెండున్నరేళ్ల తర్వాత 20 మంది కొత్త మంత్రులు..!
మంత్రి పదవులన్నీ ఒకే సారి భర్తీ చేస్తే… ఆశావహులను… ఎలా బుజ్జగిస్తారనేది అత్యంత కీలకం. ఈ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా ఆలోచించారు. మంత్రి పదవులు ఇస్తున్న ఇరవై ఐదు మందికి..పదవీ కాలం రెండున్నరేళ్లు మాత్రమేనని… నేరుగా చెప్పేశారు. రెండున్నరేళ్ల తర్వాత 20 మందికి కొత్తగా పదవులొస్తాయని, ప్రస్తుతం ఉన్నవారిలో 20 మంది అప్పటికి రాజీనామా చేయడానికి సిద్ధపడి ఉండాలని జగన్ నేరుగా ఎమ్మెల్యేలుకే చెప్పారు. వారిలో అవకాశం దక్కించుకోబోయే వాళ్లున్నారు. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. ఈ రాజీనామా విషయాన్ని జగన్ .. వైసీపీ ఎల్పీ భేటీలో రెండు సార్లు ప్రస్తావించారు. అంటే.. కచ్చితంగా… రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు మంత్రి వర్గంలోకి తీసుకుంటున్న వారిలో ఇరవై మంది మాజీ లు కావడం ఖాయమే. కొత్త వారికి అవకాశాలివ్వడం కూడా ఖాయమే. ఆ ఇరవై బెర్త్‌లపై ఆశతో.. ఆశావహులు… అసంతృప్తిని కంట్రోల్ చేసుకుంటారు.
అసంతృప్తులెవరూ నోరు మెదిపే చాన్స్ లేదు..!
ఇరవై మంత్రి పదవులు.. రెండున్నరేళ్ల కాన్సెప్ట్ ప్రముఖంగా ముందుకు తీసుకు రావడానికి కారణం… ఈ సారి వైసీపీ తరపున ఈ సారి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో పెద్ద ఎత్తున సీనియర్లు ఉన్నారు. జగన్‌తో పాటు పదేళ్లుగా నడుస్తున్న వారు ఉన్నారు. పార్టీ కోసం.. త్యాగాలు చేసిన వాళ్లు ఉన్నారు. అలాగే.. తాను మాట ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఎలా చూసినా.. మంత్రి పదవులకు అర్హులైన వారి సంఖ్య .. నలభైకి పైగానే ఉంటుంది. వీరిలో ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సామాజిక సమీకరణాలు చూసుకుని కొందరికి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. వీరందరికీ.. మంత్రి పదవులు ఇవ్వడం అసాధ్యం.అందుకే అసంతృప్తులు ఎక్కువగా ఉంటారని.. వారికి అలా.. అవకాశాలు ఉంటాయని చెప్పడానికే ఈ వ్యూహం అమలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 90 శాతం మంత్రుల్ని మార్చేస్తామని ముందుగానే చెప్పడం వల్ల.. ఇప్పుడు పదవులు చేపట్టే వారికిని మానసికంగా సిద్దం చేయడంతో.. పాటు… ఇప్పుడు అవకాశం దక్కని వారికి రెండున్నరేళ్ల తర్వాత చాన్స్ ఉంటుందని… బుజ్జగించడం… రెండు పనులు.. ఒక్కసారే అయిపోతాయని.. జగన్ అంచనా వేశారు. ఈ విషయంలో జగన్ వ్యూహం సక్సెస్ అవడం ఖాయమే.
డిప్యూటీ సీఎంలతో ప్రధాన సామాజికవర్గాలకు గాలం..!
అలాగే వైసీపీ అధినేత ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తామని ప్రకటించారు. ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులు ఇస్తారనే ఊహే…ఎవరికీ రాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కేబినెట్లో ప్రధాన సామాజికవర్గాలకు చోటు కల్పించడమే కాదు.. వారిలో ప్రధానమైన ఐదు వర్గాలకు పెద్ద పీట వేస్తున్నానన్న భావన కల్పించాలనుకుంటున్నారు. అందుకే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు… డిప్యూటీ సీఎం హోదా ఇస్తున్నారు. కేబినెట్ మంత్రి అన్నా.. ఉప ముఖ్యమంత్రి అన్నా.. ఒకటే. అయితే ఇలాంటి హోదా ఇచ్చిన వారికి.. రాజకీయంగా.. ఆయనకు.. ఉప ముఖ్యమంత్రి అనే… గుర్తింపు ఉంటుంది. ఆ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా భావిస్తారు. ఇలా రాజకీయ గుర్తింపు కోసం… ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునేందుకు… వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కులాలు, మతాల వారీగా లెక్కలు గట్టి.. ఐదుగురికి.. ఉపముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వీటిలోనే జగన్ రాజకీయ చాణక్యం బయట పడుతోంది.