వైసీపీ ఎల్పీ భేటీలో సీనియర్ నేతలు చేసిన ఓవరాక్షన్ వైసీపీలో… చర్చనీయాంశం అవుతోంది. జగన్‌ను పొగిడేసి… ఆకాశానికి ఎత్తేయడానికి కొందరు… సలహాలిచ్చి.. గొప్ప మేధావుల్లా ఫోజులు కొట్టేందుకు మరికొందరు.. ప్రయత్నించారు. ఇది అనేక మంది ఎమ్మెల్యేల ఆశ్చర్యానికి కారణం అయింది. ఎందుకంటే.. ఆ సీనియర్లు… ఎవరూ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు.. వెంట రాలేదు. అంతే కాదు.. జగన్ పై చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు మాత్రం.. జగన్ ను కనిపించే దైవంగా చెబుతున్నారు.
బొత్స గతం మర్చిపోయారా..?
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బొత్స.. అసలు ఆ బెర్త్ ఉందా లేదా.. అని టెన్షన్ పడుతున్న సమయంలో… వైసీపీ ఎల్పీ భేటీలో మాట్లాడే చాన్స్ వచ్చింది. ఆ సమయంలో మైక్ అందుకున్న బొత్స.. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేశానని.. కాని ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని గద్గద స్వరంతో చెప్పారు. మరలా మీ దగ్గర పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. నిజానికి వైఎస్ చనిపోయిన తర్వాత బొత్స ప్రవర్తన వివాదాస్పదమయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం.. హైకమాండ్ వద్ద తీవ్రంగా లాబీయింగ్ చేసుకున్నారు. చివరికి రాష్ట్ర విభజన సమయంలో అయినా పదవి వస్తుందేమోననని ఆశ పడ్డారు. ఆ సమయంలో.. హైకమాండ్‌ను మెప్పించడానికి జగన్మోహన్ రెడ్డిపై.. తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవి ఇప్పటికీ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటాయి. సోనియానే వైఎస్‌ను చంపించారని.. జగన్ ఆరోపించినప్పుడు.. అసలు వైఎస్ ను చంపించింది కుటుంబసభ్యులేనని బొత్స ఆరోపించడం… హైలెట్. అవన్నీ మర్చిపోయి.. ఇప్పుడు కొత్తగా భావోద్వేగానికి గురయ్యారు బొత్స.
పాఠాలు చెప్పే ప్రయత్నం చేసిన ధర్మాన..!
వైసీపీ శాసనసభాపక్షం సమావేశంలో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రసంగం కూడా అలాగే సాగింది. గత ప్రభుత్వం వైసీపీకి ఓటేసిన వారిని శత్రువులుగా చూసిందని.. వాళ్లందర్నీ ఆదుకోవడానికి.. త్వరలోనే ఒక నోట్ ఇస్తానని చెప్పుకొచ్చారు. అందులో తన ఆలోచనలు, సంస్థాగతంగా మనం చేయాల్సిన పనులను ఆ నోట్ లో వివరిస్తానని చెప్పారు. హామీలను ఎలా అమలు చేయాలన్నదానిపై… జగన్‌కు పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలన్నారు. అన్నీ ఒకేసారి చేయాలనే ఆలోచన విధానం కాకుండా నిధుల సౌలభ్యం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ధర్మాన ప్రసంగిస్తున్నంత సేపు.. జగన్ కాస్త అసౌకర్యంగా ఫీలయ్యారు.
బొత్సకు గ్రీన్ సిగ్నల్.. ధర్మానకు రెడ్ ..!
సీఎల్పీలో కాస్త ఓవర్ చేశారని అనుకున్న వారిలో.. సాయంత్రానికి బొత్సకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విజయసాయిరెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. కానీ ధర్మాన ప్రసాదరావుకు మాత్రం.. సమావేశంలో చెప్పినట్లు.. నోట్ రెడీ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఆయనకు బదులుగా ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్‌కు.. చాన్సిచ్చారు.