మల్లు భట్టివిక్రమార్కకు.. ప్రతిపక్ష పదవి వచ్చింది. నాలుగు నెలల్లోనే పోయింది. సాధారణంగా.. హైకమాండ్ తీసేస్తే పోతుంది. కానీ తెలంగాణలో మాత్రం భిన్నంగా జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్రను తీసేశారు. కాంగ్రెస్ ఎల్పీని తన పార్టీలో విలీనం చేసేసుకున్నారు. దాంతో మల్లు భట్టివిక్రమార్క పదవి కూడా ఊడిపోయింది. ఇది అప్రజాస్వామికమంటూ… తెలంగాణ కాంగ్రెస్ 36 గంటల దీక్షకు సిద్ధమైంది. ఇందిరాపార్క్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దీక్ష చేస్తారు.
కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎల్పీ లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనలు కంటిన్యూ చేస్తోంది. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేసిన నాయకులు .. ఇందిరా పార్కు దగ్గర దీక్షకు రెడి అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శనివారం నుండి 36గంటల పాటు నిరహార దీక్షకు దిగుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో దీక్షకు కాంగ్రెస్ దీక్షకు దిగుతోంది. అయితే ఇందిరా పార్కు లో అనుమతి ఇవ్వకుంటే… స్పీకర్ ఇంటి ముందు ధర్నాకి దిగుతామని ఉత్తమ్ హెచ్చరించారు. పార్టీ శ్రేణులు అంతా.. హైద్రాబాద్ తరలి రావాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. 12మంది ఎమ్మెల్యేల విలీనం పై కాంగ్రెస్ మండిపడుతోంది. విడివిడిగా పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ఒక్కటై విలీన తీర్మానం చేయడం చెల్లదని వాదిస్తున్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ పెండింగ్ లో ఉండగా వారి నుంచి విలీన దరకాస్తూ ను స్వీకరించడం నిబంధనలకు విరుద్ధమని స్పీకర్ తీరును తప్పు పడుతున్నారు. 12 మంది ఎమ్మెల్యే లతో రాజీనామా చేసి ఎన్నికలకు రండి..తేల్చుకుందాం అని సవాల్ విసిరారు ఉత్తమ్..
ఇప్పటికే విలీనాన్ని అపాలంటూ కాంగ్రెస్ నేతలు హై కోర్టులో వేసిన పిటిషన్ ఈ నెల11న విచారణకు రానుంది. అయితే విలీనం జరిగిపోయినందున సోమవారం మరో పిటిషన్ దాఖలు చేయాలని కాంగ్రేస్ నిర్ణయించింది. దాంతో పాటు లోక్ పాల్ లో కూడా పిటిషన్ వేసేందుకు రెడీ అవుతోంది. ఎమ్మెల్యేలు ఎలా లబ్ది పొందారు అనే ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు. పూర్తి ఆధారాలతో లోక్ పాల్ కు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఆందోళనలు చేస్తూనే రాష్ట్రపతిని ని కలిసి ఫిర్యాదు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల తరవాత దేశంలో ని వివిధ పార్టీల నాయకులను కలిసి రాష్ట్రంలోని అనైతిక చర్యలను వివరించి మద్దతు కూడకట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.