ఏ సినిమాకైనా పాజిటీవ్ టాక్ చాలా ముఖ్యం. అది ముందుగా రావాల్సింది చిత్రబృందం నుంచే. `మా సినిమా బాగా వచ్చింది… అదిరిపోతుంది` అని చెప్పుకుంటూ పోతే – జనాలకు నమ్మకం వస్తుంది. ‘ఎలా ఆడుతుందో తెలీదు. పెద్దగా నమ్మకాలు పెట్టుకోవాల్సిన పని లేదు’ అని హీరోనే చెబుతుంటే – ఇక ఆ సినిమాని మిగిలిన జనాలు నమ్మేదెలా..?
రణరంగం సమస్య అదే. ఈ సినిమాపై ఎలాంటి హైపూ లేదు. యేడాదిన్నరగా సెట్స్‌పై ఉన్న సినిమా ఇది. శర్వా సినిమాని ఇంత లాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గ్యాప్‌లో శర్వాతో మూడు సినిమాలు లాగించేయొచ్చు. టైటిల్, ఫస్ట్ లుక్ బయటకు వచ్చినా జనాల్లో పెద్దగా క్రేజ్ లేదు. శర్వా పక్కన కాజల్‌ని ఎంచుకోవడం మరింత డిజెట్వాండేజ్. పైగా ఈ సినిమా గురించి శర్వా కాస్త నెగిటీవ్‌గా మాట్లాడుతున్నాడని టాక్. ‘ఈ సినిమా ఎవరూ నమ్మకం పెట్టుకోకండి. ఆడితే ఆడుద్ది.. లేదంటే లేదు’ అని తన సన్నిహితులతో చెబుతున్నాడట. ఓ హీరో, సినిమా విడుదలకు ముందు ఇలా చెప్పుకోవడం ఆశ్చర్యమే. కాకపోతే.. నాని కూడా ఇది వరకు ఇలానే చేశాడు. ‘కృష్ణార్జున యుద్ధం’ సమయంలో ‘ఈ సినిమా ఆడకపోవొచ్చు’ అంటూ తన సన్నిహితులకు హింట్ ఇచ్చాడు. అన్నట్టుగానే నాని వరుస విజయాలకు ఆ సినిమా పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇలాంటి నెగిటీవ్ స్టేట్మెంట్ల ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే. సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అవుతుంది. ఒకవేళ బాగుంటే మాత్రం ముందిచ్చిన స్టేట్మెంట్లను ఎవ్వరూ పట్టించుకోరు. బాలేకపోతే మాత్రం.. ‘ముందే చెప్పానుగా.. ఇలా జరుగుతుందని ‘ అంటూ హీరో తప్పించుకోవచ్చు. కాకపోతే… శర్వా ఇలా తన సినిమాపై తానే నెగిటీవ్‌గా మాట్లాడుతున్నాడన్న సంగతి దర్శక నిర్మాతలకు తెలిసిపోయింది. అందుకే శర్వాపై వాళ్లిద్దరూ గుర్రుగా ఉన్నారని టాక్.