వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సారిగా.. సెక్రటేరియట్‌లోని తన చాంబర్లో అడుగు పెట్టారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి పెట్టిన ముహుర్తం ప్రకారం… ఉదయం సరిగ్గా 8:39కి మొదటి అడుగు పెట్టారు. ఉ. 8:50 గంటలకు మొదటి ఫైల్‌పై సంతకం పెట్టారు. మొత్తంగా మూడు ఫైళ్లపై సంతకాలు పెట్టారు. ఆశ వర్కర్ల జీతం 3,000 నుండి 10,000 రూపాయలకు పెంచుతూ తొలి ఫైల్‌పై, – అనంత ఎక్స్‌ప్రెస్ హైవే అనుమతుల కొరకు సంబంధించిన ఫైల్‌పై రెండవ సంతకం, జర్నలిస్ట్ ఇన్సూరెన్స్ పరిమితి రూ. 10 లక్షల రూపాయల వరకు పెంచుతూ.. రెన్యూవల్ చేస్తూ మూడో ఫైల్‌పై సంతకం చేశారు.
ఆ తర్వాత కార్యదర్శులతో సమావేశమయ్యారు. గతంలో తాను ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం లేదన్నట్లుగా చేసిన విమర్శలు అధికారుల దృష్టిలో ఉంటాయన్న ఉద్దేశంతో… అధికారులపై తనకు పూర్తి నమ్మకం ఉందని భరోసా ఇచ్చారు. అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి ధృఢ సంకల్పంతో ఉన్నానని.. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయండని అధికారులకు జగన్ పిలుపునిచ్చారు. ఆ తర్వాత సెక్రటేరియట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో… మధ్యంతర భృతి గురించి… మాట్లాడారు. సెక్రటేరియట్ ఉద్యోగలకు 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని.. తొలి కేబినెట్ భేటీలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. జగన్ ఈ ప్రకటన.. సెక్రటేరియట్ ఉద్యోగులను సంతృప్తి పరిచింది. అయితే… ఇతర ఉద్యోగుల సంగతేమిటన్న ప్రశ్న సహజంగానే అందరిలోనూ వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో… ప్రభుత్వ ఉద్యోగులందరికీ.. తాను అధికారం చేపట్టిన వెంటనే… 27 శాతం ఐఆర్ ఇస్తానని ప్రకటించారు. అలాగే.. పీఆర్సీని కూడా సకాలంలో ఏర్పాటు చేస్తామన్నారు. దాని ప్రకారం… 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు కానీ.. దాన్ని సచివాలయ ఉద్యోగులకే పరిమితం చేయడం.. ఇతరుల్లో అసంతృప్తి కలిగిస్తోంది . అయితే ఉద్యోగుల్లో… సెక్రటేరియట్ ఉద్యోగులు.. వేరే ఉద్యోగులు అని ఉండరని.. అందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారని… అందరికీ… 27 శాతం ఐఆర్ ఉంటుందని.. కొన్ని ఉద్యోగసంఘాల నేతలు చెబుతున్నారు. అసలు క్లారిటీ మాత్రం… కేబినెట్ భేటీలోనే వచ్చే అవకాశం ఉంది.