జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. ఆయన నేరుగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని.. పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు. కిషోర్ బాబు.. ప్రధాని మోడీ సమక్షంలో… ఆదివారం.. భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో.. ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తిరుపతి పర్యటనకు వస్తున్న మోడీ.. రేపు సాయంత్రం… శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఈ సమయంలో.. ఎక్కడో చోట రావెల కిషోర్‌కు కండువా కప్పనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి జనసేన తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన రావెల కిషోర్ బాబు.. మూడో స్థానంలో నిలిచారు. పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కానీ.. కొన్ని టీడీపీ ఓట్లను మాత్రం చీల్చగలిగారు. దాంతో అక్కడ.. వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత విజయం సాధించారు. ఆమె ఇప్పుడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేనలో ఉంటే.. రాజకీయ భవిష్యత్ ఉండదనుకున్న.. రావెల కిషోర్.. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందుకే… పవన్ కల్యాణ్ జరుపుతున్న సమీక్షా సమావేశాలకు కూడా రావెల కిషోర్ హాజరు కావడంలేదు.
గతంలోకేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రావెల.. ఒకప్పుడు… భారత స్పీకర్‌గా పని చేసిన జీఎంసీ బాలయోగి వద్ద… పని చేసేవారు. ఆ పరిచయంతో.. టీడీపీలో.. చేరి 2014లో ప్రత్తిపాడు టిక్కెట్ సంపాదించగలిగారు. అనూహ్యంగా విజయం సాధించడంతో.. సామాజిక సమీకరణాల లెక్కలో మంత్రి పదవి కూడా దక్కింది. కానీ వివాదాస్పద రాజకీయ ప్రవర్తన కారణంగా.. ఆయనను మధ్యలోనే పదవి నుంచి తొలగించారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీలో ఉంటే టిక్కెట్ కూడా ఇవ్వరన్న ఉద్దేశంతో.. వైసీపీ చేరేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో.. జనసేనలో చేరారు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో.. ఏదో ఓ పదవి వస్తుందన్న ఉద్దేశంతో.. ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల తర్వాత జనసేనలో ఉన్నవారిలో కాస్త ప్రముఖ నేతను పవన్ కల్యాణ్ కోల్పోతున్నట్లే భావించాలి.