ఎట్టకేలకు వైఎస్ జగన్ క్యాబినెట్ కూర్పు పూర్తయింది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా క్యాబినెట్ కూర్చిన విధానాన్ని చూసి, జగన్ పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే అదే సమయంలో స్పీకర్ గా తమ్మినేని సీతారాం ని నియమించారు జగన్. తమ్మినేని సీతారాం విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా సెటైర్లు వినిపిస్తున్నాయి.
తమ్మినేని సీతారాం సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నేత. మొదట్లో, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తమ్మినేని సీతారాం, చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన సమయంలో ప్రజా రాజ్యం లో కీలక నేతగా ఉన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి నుండి వైయస్ జగన్ కి అండగా నిలుస్తూ వచ్చారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో, ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నాడు అని, ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారని బలమైన రూమర్లు వచ్చాయి. ఈ రూమర్లని మీడియా వర్గాలు తమ్మినేని సీతారాం వద్ద ప్రస్తావించగా, ఆయన దానికి స్పందిస్తూ, ” అవన్నీ ఊహాగానాలే అని, తాను చస్తే, తన చితిమీద కప్పేది కూడా తెలుగుదేశం పార్టీ జెండాయే” అని వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించిన వారం రోజుల తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. దీని మీద అప్పట్లో చాలా సెటైర్లు వచ్చాయి.
అయితే మొన్నా మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మరొకసారి తడబడ్డారు తమ్మినేని సీతారాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు అని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ప్రశ్నిస్తే,” కొంత మంది టీడీపీ నేతల లాగా నేను బీకాంలో ఫిజిక్స్ చదువుకోలేదు ( జలీల్ ఖాన్ ని ఉద్దేశించి), నేను ఇంటర్మీడియట్ లో సిఈసి చదివి ఆ తర్వాత డిగ్రీలో హెచ్ఈసీ చదివాను” అని వ్యాఖ్యానించారు. అయితే డిగ్రీలో హెచ్ఈసి అని తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు అప్పట్లో నెటిజన్ల ని నవ్వుల్లో ముంచెత్తాయి. కారణం, హెచ్ఈసి అనే గ్రూపు ఇంటర్మీడియట్ లో ఉంటుంది కానీ డిగ్రీలో కాదు మరి.
అయితే ఇప్పుడు తమ్మినేని సీతారాం ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కావడంతో, అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ, అసెంబ్లీ ని ఎలా నడిపిస్తాడో చూడాలి అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.