ఆంధ్రజ్యోతి ఎండీ.. వేమూరి రాధాకృష్ణ.. ప్రతీ వారం రాసే కొత్త పలుకులో.. స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ.. ఆయన రచనలు.. ఓ పంథాలో సాగగా.. ఇప్పుడు… ట్రెండ్‌కు తగ్గట్లుగా కనిపిస్తున్నాయి. ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డిని అభినందించడానికి ఆయన కూడా పోటీ పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం రాసిన ఆర్టికల్‌లోనూ ఆయన… అదే తరహా భావనలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు.
జగన్ మధ్య అంత తేడా కనిపిస్తోందా…?
” తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును గమనించిన వారికి ఆయన ముఖ్యమంత్రి అయితే..? అన్న భయాలు ఉండేవి…” అని.. రాధాకృష్ణ తన వ్యాసంలో రాసుకొచ్చారు. అంటే.. అప్పుడెలా ఉండేవారో.. ఓ ఉదాహరణగాచెప్పి ఉండాల్సింది. అలాగే.. ఇప్పుడెలా ఉంటున్నారో మరో ఉదహరణగా చెప్పాల్సి ఉంది. కానీ… అలాంటివేమీ లేకుండా.. జగన్మోహన్ రెడ్డి… అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు మారిపోయారని… ఎంతో మంచిగా ఉంటున్నారని.. చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో చాలా మందికి అర్థం కాలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనా అని … రాధాకృష్ణ కూడా సందేహ పడాల్సిన పరిస్థితి… వచ్చిందంటే.. ఆ మార్పు.. జగన్మోహన్ రెడ్డిలోనా.. లేక రాధాకృష్ణలోనా అన్నదానిపై పాఠకులే నిర్ణయించుకోవాల్సి ఉంది.
బీజేపీతో వైరానికి చంద్రబాబును ప్రొత్సహించిన వాళ్లలో ఆర్కే లేరా…?
చంద్రబాబు రాజకీయ నిర్ణయాలు ఇటీవలి కాలంలో సొంతంగా తీసుకోవడం లేదని.. ఆ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటూ ఉంటాయి. ఓ కోటరీ ఉంటుందని.. ఆ కోటరీలో ఆర్కే కూడా ఉంటారని చెబుతారు. ఆ కోటరీ ఇచ్చే సూచనలు.. సలహాలు మేరకే… బీజేపీతో ఎగ్రెసివ్ గా వెళ్లారని చెబుతూంటారు. నిజానికి భారతీయ జనతా పార్టీతో సున్నం పెట్టుకోవాలని చంద్రబాబుకూ లేదని చాలా మంది చెబుతారు. కానీ.. కారణం ఏదైనా… మోడీతో.. దూరం పెరిగింది. దాన్ని దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా… మీడియా… మరికొంత మంది ప్రభావంతో… పెద్దది చేసుకున్నారు. బయటకు వస్తేనే మంచిదన్న భ్రమలు కల్పించి… అలాగే చేయించారు. చివరికి అలాంటి వాళ్లందరూ నాలిక మడతేశారు. చివరికి ఆర్కే కూడా., హోదా విషయంలో ఉద్యమాలకు పులికొల్పింది ఆంధ్రజ్యోతి. కానీ ఆర్కే మాత్రం.. అప్పుడప్పుడు.. తన వ్యాసాల్లో… హోదా రాదు.. వస్తే మంచిది అంటూ కామెంట్లు చేశారు. దాన్నే చూపించి.. తాను ముందే చెప్పానని చెబుతున్నారు. కానీ వాస్తవానికి .. చంద్రబాబు.. బీజేపీతో విరోధం పెంచుకోవడానికి… ఆర్కే కూడ ఓ కారణమని చెబుతారు.
జగన్ అంత గొప్పగా అవినీతిని కట్టడి చేస్తారని ఎలా అనుకుంటున్నా..?
వేమూరి రాధాకృష్ణ.. చంద్రబాబు బీజేపీతో సున్నం పెట్టుకున్నట్లుగా.. జగన్ తో పెట్టుకుని తానెందుకు నష్టపోవాలని అని అనుకుంటున్నారేమో .. అన్న అభిప్రాయం ఏర్పడకుండా ఉండదు. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి.. అవినీతి ప్రక్షాళన అనే మాటలు కేవలం.. మాటల్లోనే చెబుతున్నారని.. ఆయనకు స్పష్టంగా తెలుసు. ప్రమాణస్వీకారం చేయకుండానే… నిబంధనలకు విరుద్ధంగా.. సొంత పత్రికకు.. రూ. కోట్ల కొద్దీ ప్రకటనలు ఇచ్చి… ఇతర పత్రికలకు చాలా పరిమితంగా ప్రకటనలు ఇచ్చినప్పుడే.. జగన్మోహన్ రెడ్డి.. ఎలా పరిపాలించబోతున్నారో ఎవరికైనా సులువుగా అర్థమైపోతుంది. సాధారణంగా ఎవరైనా తన పత్రికకు.. అలా ప్రకటనలు ఇచ్చుకోవాలంటే.. నిబంధనలకు అనుగుణంగా ఉన్నా… నైతికత కాదనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా అనుకోలేదు. పైగా ఆంధ్రజ్యోతికి ఇవ్వాల్సిన ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. అన్నీ అనుమానాస్పదంగానే ఉంటున్నాయి. కానీ ప్రశ్నించడం ఇప్పుడే ఎందుకు అనుకుంటున్నారో… ప్రశ్నించి .. ఏం సాధిస్తామనుకుంటున్నారో కానీ.. ఆర్కే కూడా.. నాలుక మడతేశారు.