“ఐదు సార్లు గెలిచినా మంత్రిని కాలేకపోయా.. ఎస్సీ, బీసీగా ఎందుకు పుట్ట లేదనిపిస్తోంది..!” …
ఈ మాట అన్నది కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఆయన పాణ్యం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అధికార పార్టీల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఐదో సారి గెలిచారు. అత్యంత సీనియర్‌గా తనకు చోటు దక్కుతుందని.. ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ చాన్స్ దక్కలేదు. కర్నూలు జిల్లా ఆలూర్ నుంచి బీసీ కోటాలో.. రెండో సారి గెలిచిన గుమ్మనూరు జయరాంకు చాన్స్ దక్కింది. అలాగే.. రెండోసారే గెలిచినా… కాస్తే మేధావిగా పేరు తెచ్చుకోవడంతో.. బుగ్గనకూ చాన్స్ దక్కింది. ఐదు సార్లు గెలిచిన తనకు మాత్రం.. అవకాశం రాలేదు. ప్రమాణస్వీకారానికి చాన్స్ వస్తుందేమోనని… విజయవాడలోనే మకాం వేసిన ఆయన.. చివరికి నిరాశతో… దుర్గమ్మను దర్శించుకుని తిరుగుపయనమయ్యారు.
ప్రజాభిమానం గెలుచుకున్నా .. సామాజిక లెక్కల్లో ఓడిపోతున్నారు..!
నిజానికి రాంభూపాల్ రెడ్డి ఆవేదన… ఆయన బయటకు చెప్పుకున్నారు. కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు ప్రధాన సామాజికవర్గాల నేతలందరికీ.. దాదాపుగా ఉన్న ఆవేదన అదే. కానీ వాళ్లు బయటకు చెప్పుకోలేరు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి రెడ్డి సామాజికవర్గం డామినేటింగ్ గా ఉంటుంది. వైఎస్ హయాంలోనూ… ఆ వర్గం మద్దతే ఎక్కువ. అందుకే.. ఆ పార్టీకి.. రెడ్డి నేతలు ఎక్కువగా ఉంటారు. అటు తెలంగాణలో అయినా.. ఇటు రాయలసీమలో అయినా.. వారి ప్రాబల్యం ఎక్కువ కాబట్టి.. నేతలూ ఎక్కువగా ఉంటారు. జగన్ సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత వారంతా.ఆ పార్టీ వైపు మళ్లారు. అందరికీ న్యాయం చేయడం అసాధ్యం. పార్టీ కోసం కష్టపడినా… సీనియార్టీ ఉన్నా… కేవలం “రెడ్డి” సామాజికవర్గం అన్న కారణంగా అవకాశాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ఇప్పటి పరిస్థితే తీసుకుంటే… రాయచోటి శ్రీకాంత్ రెడ్డి దగ్గర్నుచి రోజా, భూమన, కాటసాని రాంభూపాల్ రెడ్డి, అనంత వెంట్రామిరెడ్డి, ఆనం, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేవలం సామాజికవర్గ కోణంలోనే అవకాశాలు కోల్పోయిన వారు.. పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ.. రాంభూపాల్ రెడ్డి తరహా ఆలోచన వచ్చే ఉంటుంది. కానీ బయట పెట్టుకోలేరు.
సామాజిక సమరంలో వారికి ఎప్పుడూ ఓటమే..!
వైసీపీలో రెడ్డి సామాజికవర్గం నేతలకు.. ఆ పరిస్థితి ఉంటే.. టీడీపీలో కమ్మ సామాజికవర్గం నేతలకు.. ఆ కష్టం ఉంది. తెలుగుదేశం పార్టీకి సంప్రదాయంగా అండగా ఆ వర్గం ఉంటుంది. నేతలు కూడా ఆ పార్టీలో ఎక్కువగా ఉంటారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూంటారు. ప్రజాభిమానం కూడా పొందుతూ ఉంటారు. అదే పనిగా గెలుస్తూ ఉన్నా.. వారికి అవకాశాలు దక్కవు. ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఐదు సార్లు గెలిచినప్పటికీ… ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అలాగే.. రాయలసీమ నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ.. పయ్యావుల, దామచర్ల, గొట్టిపాటి, యరపతినేని, బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్లకు అవకాశాలు దక్కకపోవడానికి వారు … ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు కావడమే కారణం. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. వారు పదవులపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి లేకుండా పోతోంది.
వైసీపీలో ఓ వర్గం… టీడీపీలో మరో వర్గం .. పనికే.. పదవులకు కాదు..!
ఎక్కువ ప్రాధాన్యం.. ఇస్తే.. సొంత సామాజికవర్గానికి పెద్ద పీట వేశారని… విమర్శలు వస్తాయి. అందుకే పరిమితంగా అవకాశాలు ఇస్తారు. అలా అవకాశాలు ఇస్తే.. పార్టీ అధికారంలోకి వచ్చినా… వచ్చేందుకు కష్టపడినా.. తమ వర్గానికి అవకాశం ఇవ్వలేదనే అసంతృప్తి పెరిగిపోతుంది. ఇదంతా రెండు పార్టీలకూ.. తప్పించుకోలేని పరిస్థితిగా మారింది. ప్రజాబలంతో గెలుస్తున్నా సామాజిక వర్గాల లెక్కల్లో… ఆ పార్టీలకు చెందిన నేతలు… ఓడిపోతున్నారు. అవకాశాలు పొందలేకపోతున్నారు. అందుకే…. ఆయా వర్గాల్లో పుట్టడమే శాపమనుకుంటున్నారు..! వారి దృక్కోణంలో అది నిజం కూడా..!