టాలీవుడ్ లోకి డాడీ సురేష్ అండతో సర్రున దూసుకువచ్చాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. 2014లో అల్లుడు శ్రీను. ఆ రోజుల్లో టాప్ హీరోల సినిమాల బడ్జెట్ రేంజ్ లో అల్లుడు శ్రీను చేసాడు. నలభై కోట్ల మేరకు బడ్జెట్, 25 కోట్ల వసూళ్లు. అయితేనేం, డ్యాన్స్ లు ఫైట్లు విరగదీసాడు, కాస్త రెండు మూడు సినిమాలు చేస్తే, లెవెల్ లోకి వస్తాడు అనుకున్నారు. నిర్మాత సురేష్ కు పది కోట్ల నష్టం. కొడుకు లాంచింగ్ కాబట్టి ఓకె.
కానీ ఆ వెంటనే పెద్ద రాంగ్ స్టెప్. భీమినేని డైరక్షన్ లో ఓ జిరాక్స్ సినిమా. పరమ డిజాస్టర్. నిర్మాతలకు మొత్తం డబ్బులు పోయాయి.
ఆ తరువాత వెంటనే బోయపాటి లాంటి భారీ దర్శకుడితో 45 కోట్ల బడ్జెట్ లో జయజానకీనాయక సినిమా. సినిమా బాగుంది అని అప్లాజ్ వచ్చింది. కానీ మళ్లీ షరా మామూలే. నిర్మాత కుదేలు. కాస్ట్ ఫెయిల్యూర్ అని టాక్.
ఆ పైన శ్రీవాస్ డైరక్షన్ లో సాక్ష్యం సినిమా. ముఫై కోట్ల బడ్జెట్. కానీ ఈసారి డైరక్టర్స్ ఫెయిల్యూర్. మళ్లీ నిర్మాతకు నష్టాలే.
ఆ తరువాత కొత్త నిర్మాతలతో కవచం. కొత్త డైరక్టర్. కాస్త మీడియం బడ్జెట్. కానీ సినిమా ఫెయిల్యూర్. కాస్ట్ పెయిల్యూర్ కాదు ఈసారి. కథ, కథనం ఇంకా..ఇంకా. మళ్లీ నిర్మాతలకు నష్టాలే.
లేటెస్ట్ గా ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ లో సీత సినిమా. ఇది కూడా డైరక్టర్స్ ఫెయిల్యూరే. సబ్జెక్ట్, హీరో క్యారెక్టర్ సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. హీరోను దాదాపు డమ్మీని చేసేసారు. నిర్మాతకు, హోల్ సేల్ బయ్యర్ కు చెరో రెండు కోట్లు నష్టాలే అని టాక్.
డైరక్టర్ తేజ గత పదేళ్ల పరాజయాల జాబితాలో మరో సినిమా పెరిగింది. కాస్ట్ ఫెయిల్యూర్ అయినా, సబ్జెక్ట్, డైరక్షన్ ఫెయిల్యూర్ అయినా తప్పు డైరక్టర్లదే. కానీ దెబ్బలు మాత్రం బెల్లంకొండ శ్రీనివాస్ కు తగులుతున్నాయి.
దాని వల్ల టాప్ హీరోల రేంజ్ లో లాంచ్ అయిన బెల్లంకొండ ఇప్పుడు మీడియం రేంజ్ కన్నా కిందకు వచ్చేస్తున్నాడు. సీత కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా 6 కోట్లు దాటలేదు. నైజాం, సీడెడ్ పక్కన పెడితే, ఉత్తరాంధ్రతో సహా మిగిలిన ఏ ఏరియాలోనూ కోటి దాటలేదు.
ఇప్పుడు చేతిలో వున్నది రాక్షసుడు సినిమా ఒక్కటే. దానికి రమేష్ వర్మ దర్శకుడు. రమేష్ వర్మ పేరుతో బిజినెస్ చేయడం అన్నది కష్టం. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది. పైగా రాక్షసన్ కు గ్లామర్, ఫ్యామిలీ కంటెంట్ కన్నా, థ్రిల్లర్ కంటెంట్ ఎక్కువ. అందువల్ల ఈ సినిమా ఏం చేస్తుందో చూడాలి.
రెండోకొడుకును హీరోగా లాంచ్ చేద్దాం అని ప్రయత్నిస్తున్న బెల్లంకొండ సురేష్ ఇప్పుడు పెద్ద కొడుకు కెరీర్ ను ట్రాక్ లో పెట్టడానికి ముందు కిందా మీదా పడాల్సిన పరిస్థితి వచ్చింది.