తెలుగునాట హీరోలు వెండితెర వేల్పులు. వాళ్లది దేవుళ్లుగా భావిస్తుంటారు అభిమానులు. హీరో పుట్టిన రోజు వచ్చిదంటే.. దాన్నో పండుగ రోజుగా జరుపుకోవడం, కేకులు కట్ చేయడం, రక్తదానాలు చేయడం, కటౌట్లు కట్టడం మామూలే. ఇలాంటి హీరోల అభిమానులందరికీ తమ్మారెడ్డి భరద్వాజా ఓ చక్కటి సలహా ఇస్తున్నారు. హీరో పుట్టిన రోజు వస్తే… అభిమానులు ఎలాగూ తలా ఇంత వేసుకుని ఉత్సవాలు జరుపుతారని, ఆ డబ్బుతో ఓ గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించొచ్చని, అవసరమైతే ఆ గ్రామానికి సదరు హీరోని తీసుకెళ్లి – ఆయన చేతుల మీదుగా మంచి పనులు చేయొచ్చని, ఇలా చేస్తే హీరోకీ, అతని ఫ్యాన్స్‌కి కూడా మంచి పేరు వస్తుందని సూచించారు. తమ్మారెడ్డి చెప్పేదీ నిజమే. కటౌట్లు కడితే ఏమొస్తుంది, ఓ పేదవాడి ఆకలి తీరిస్తే అందులో ఉంది ఆనందం. ఈ సలహా పాటించదగినదే. కాకపోతే… తెలుగునాట ఫ్యాన్స్‌లో అత్యుత్సాహం, ఆరంభశూరత్వాలు ఎక్కువగా కనిపిస్తాయి. తమ హీరోని ఎవరైనా ఏమన్నా అన్నారంటే.. చొక్కాలు చించుకునేంత కోపం ఉంటుంది. ఆ కోపాన్నీ, అభిమానాన్నీ, ఉత్సాహాన్నీ ఇలా మంచికి ఉపయోగిస్తే, హీరోలు కూడా అందుకు మార్గదర్శకత్వం వహిస్తే… హీరోలు నిజంగానే దేవుళ్లవుతారు. మరి అది జరిగే పనేనా..??