శాసనసభా పక్షాన్ని తెరాస ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దీక్ష రెండో రోజుకి చేరుకుంది. 36 గంటలపాటు నిరసన తెలుపుతామంటూ దీక్షకు దిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. అయితే, రెండోరోజుకి చేరుకునేసరికి.. ఆ దీక్షను ఆమరణ దీక్షగా కొనసాగిస్తారని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిరసన తీవ్రత మరింత పెంచుతామని ఆయన అంటున్నారు. దీన్ని ఇక్కడితో ఆపకూడదనీ, ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగాలనీ, స్పీకర్ తీరుపైనా సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న రాజకీయ విధానాలపైనా రాష్ట్రమంతా చర్చ జరగాలంటే.. దీక్షను కొనసాగించడమే ఉత్తమం అని టి. కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
భట్టి దీక్షకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాతోపాటు, జీవన్ రెడ్డి, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్, టీజేయస్ అధినేత కోదండరామ్… ఇలా పలువురు ప్రముఖులు ఇందిరా పార్క్ దగ్గరున్న దీక్షాస్థలికి వస్తున్నారు. అయితే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు నలుగురుంటే… వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా ముగ్గురూ ఇంకా ఈ దీక్ష దగ్గరకి రాకపోవడం కొంత చర్చనీయం అవుతోంది. ఓరకంగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతి ముఖ్యమైన కార్యక్రమంగా దీన్ని చూడాలి. వరుస ఓటములు తరువాత తెరాసపై ధీటైన పోరాటాన్ని కొనసాగించేందుకు ఇదే మంచి సందర్భం. ఎందుకంటే, ఫిరాయింపులపై ప్రజల్లో కూడా కొంత చర్చ జరుగుతోంది. తెరాసకు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉండి కూడా… ఇలా ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, సీఎల్పీ విలీనం చేసేంత వరకూ వెళ్లాల్సిన అవసరం ఏముందనే అంశంపై చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందని తెరాస నేతలు చెబుతున్నా, ఇది రాజకీయ కక్ష సాధింపు ధోరణిగానే కనిపిస్తున్న పరిస్థితి!
36 గంటల దీక్షను ఆమరణ దీక్షగా కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించినా… దీనిపై పోలీసుల స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి 36 గంటలే నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ సమయం పూర్తిగానే పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా దీక్ష కొనసాగించేందుకు అనుమతి పొడిగిస్తారా… లేదంటే, శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేసే పరిస్థితి ఉంటుందా అనేదీ కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, ఈ పోరాటం కొనసాగుతుందనీ, రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో కూడా దీనిపై చర్చించే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని భట్టి అంటున్నారు. త్వరలోనే రాష్ట్రపతిని కలిసి, సీఎల్పీ విలీనం తీరుపై ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. ఫిరాయింపులపై న్యాయ పోరాటానికీ కాంగ్రెస్ సిద్ధమైన సంగతి తెలిసిందే.