ఒక ఓటమిని జనసేనను ఆపలేదంటూ పార్టీ అభిమానులతో చెప్పారు అధినేత పవన్ కల్యాణ్. నా శవాన్ని నలుగురు మోసే వరకూ జనసేనను ముందుకు తీసుకెళ్తాననీ, వెనక్కి తగ్గే ప్రసక్తి అస్సలు లేదన్నారు. గెలుపు వచ్చినప్పుడు తనవాళ్లెవరో తెలీదనీ, ఓటమిలో వెంట ఉండేవాళ్లే మనవాళ్లని పవన్ అన్నారు. కుయుక్తి రాజకీయాలు చేయాలంటే అది తనకు తెలీక కాదనీ… అలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ మార్గం తనది కాదన్నారు. పార్టీ ఆఫీస్ లో తాను ఎప్పుడూ అందరికీ అందుబాటులోనే ఉంటానని పవన్ కల్యాణ్ చెప్పారు. పాతికేళ్ల విజన్ తో పార్టీ పెడుతున్నానని మొదట్నుంచీ చెప్పాననీ, ఓటములూ ఎదురుదెబ్బలూ ఉంటాయని తనకు తెలుసనీ, అన్ని తట్టుకుని నిలబడ్డానికే నిర్ణయం తీసుకున్నాననీ, వెన్నుచూపే తత్వం తనది కాదని పవన్ మరోసారి చెప్పారు.
నిజానికి, పవన్ కల్యాణ్ ఇప్పుడు పార్టీ అభిమానులకు ఇవ్వాల్సిన భరోసా ముమ్మాటికీ ఇదే! ఎందుకంటే, ఆయన్ని ఒక పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే ఇతర రాజకీయ పార్టీలు విమర్శిస్తూ ప్రచారం చేశాయి. సామాన్య ప్రజల్లో కొంతమందిలో కూడా ఈ అభిప్రాయం ఉంది. ఎన్నికలు అయిపోయాక ఆయన పార్టీని పట్టించుకోడు, మళ్లీ సినిమాలంటూ వెళ్లిపోతాడూ… ఇలా కొంత చర్చ జరిగింది. దానికి కారణమూ లేకపోలేదు. జనసేన పెట్టినప్పట్నుంచీ పూర్తిగా పార్టీ మీదే ఫోకస్డ్ గా పవన్ మొదట్లో పనిచేయలేదనేది వాస్తవం. ఏ కాకినాడలోనో, అనంతపురంలోనో, తిరుపతిలోనో సభలు పెట్టేవారు. ఒక సభలో పార్టీ ఫలానా అంశంపై పోరాడుతుందని బలంగా చెప్పేవారు. ఆ తరువాత, దానికి సంబంధించిన కార్యాచరణ ఉండేది కాదు! మళ్లీ కొంత విరామం తరువాత.. మరో సభ. ఈ విరామాల వల్లనే పవన్ పై విమర్శలొచ్చేవి. ఇంకోటి, ఎన్నికల సందర్భంలో టీడీపీకి వ్యతిరేకంగా ఆయన పోరాటం మొదలుపెట్టినా… చివరికి వచ్చేసరికి ఆయన టీడీపీకే మద్దతు ఇచ్చేస్తారనే ప్రచారమూ జరిగింది.
ఇలాంటి అనుమానాలన్నీ ఇప్పుడు ఒక్కోటిగా పవన్ కల్యాణ్ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పార్టీ ఆఫీస్ లోనే ఉంటానంటున్నారు, అందరికీ అందుబాటులోనే ఉంటాననీ, పాతికేళ్ల సుదీర్ఘ ప్రయాణం కొనసాగుతుందని చెబుతున్నారు. ఇది అభిమానులకు ఇచ్చే ఒక మంచి సంకేతమే. ఇప్పట్నుంచీ ఒక పడక్బందీ వ్యూహంతో పవన్ వ్యవహరిస్తే… ఏపీలో విస్తరిస్తామని ఇప్పుడు సిద్ధమౌతున్న భాజపాకంటే, జనసేనకే మరింత ఆదరణ పెరిగే ఆస్కారం ఉంటుంది. జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ముందు… భాజపా అధ్యక్షుడిగా ఇప్పుడున్న నాయకుల్లో ఎవరున్నా దానికి సరిపోరు. మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలన్నీ ఇప్పుడు జనసేన ముందున్నాయి.