పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా జనసేన పార్టీ సమీక్ష కార్యక్రమంలో పాల్గొంటూ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం క్యాడర్ ని సంసిద్ధం చేస్తున్నాడు . పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా ఒక అభిమాని తో జరిపిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. జనసేనకు ఓటు వేసే ధైర్యం మీకు లేనప్పుడు పార్టీ ఎలా నడపాలో నాకు సలహాలు ఇవ్వద్దు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వివరాల్లోకి వెళితే,
ఇటీవల జనసేన కార్యక్రమాలలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అక్కడ ఉన్న సభికులను ఉద్దేశించి, ఇక్కడ ఉన్న వారిలో 60 శాతం మంది జనసేనకు ఓటు వేయలేదు అని నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అయితే, అక్కడే ఉన్న ఒక అబ్బాయిని ఉద్దేశించి, నువ్వు జనసేనకి ఓటు వేశావా అని అడగగా ఆ అబ్బాయి, తాను జనసేన అభిమానినే కానీ ,వైఎస్సార్ సీపీకి ఓటు వేసినట్లు గా తెలిపాడు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ, జనసేనకు ఓటు వేయలేదు అని చెప్పిన నీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను, మీకెవరికైనా ‘మీకు ఓటు వేయలేదు, జనసేన పార్టీకి ఓటు వేశానని ధైర్యంగా జగన్ ముందు చెప్తే సత్తా ఉందా’ అని వ్యాఖ్యానించాడు.
అయితే, జనసేన పార్టీకి ఓటు వేసే ధైర్యం లేనివాళ్లు వచ్చి, నేను పార్టీ ఎలా నడపాలో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. అలాగే ఇదే సమీక్ష కార్యక్రమాల్లో మాట్లాడుతూ, తనను ఓడించడానికి వైఎస్సార్ సీపీ నాయకులు 150 కోట్లు ఖర్చు పెట్టారని, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎంతో ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు.