” ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరవేర్చలేదని కొందరు అంటున్నారు. దేశంలో ఆకాంక్షలు పెరిగిపోతున్నాయి. ఇలా పెరగడం.. దేశ సౌభాగ్యానికి సంకేతం…” ఇది… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రెండో సారి పదవి చేపట్టిన తర్వాత … తిరుపతికి వచ్చి .. ఏర్పాటు చేసిన బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలు. తిరుపతి వేదికగా.. ఐదేళ్ల క్రితం.. ప్రత్యేకహోదా హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని.,. ఇప్పుడు అదే వేదికగా హోదా గురించి ఏమైనా చెబుతారేమోనని… ఆంధ్రప్రదేశ్ ప్రజలు … ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో… అదో ఆకాంక్షగా ప్రధాని మోదీ తేల్చేశారు. నెరవేరుస్తామన్న హామీని మాత్రం ఇవ్వలేదు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి.. ప్రజల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామనే పడికట్టు డైలాగ్‌ను మాత్రం పదే పదే చెప్పారు. పార్లమెంట్ వేదికగా.. ఓ ప్రధాని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేకపోయిన ప్రధాని.. అభివృద్ధి విషయంలో మాత్రం.. మాటల్లో కావాల్సినంత సహకారం అందిస్తానని… నేరుగా చెబుతున్నారు. ప్రసంగంలో .. ఏపీ కొత్త సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. జగన్ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో… ఏపీ అన్ని వనరులు ఉన్న రాష్ట్రమని.. అభివృద్ధి చెందడానికి.. నవ్యాంధ్రకు ఎంతో అవకాశం ఉందన్నారు.
భవిష్యత్‌లో తమిళనాడు, ఏపీల్లో .. అధికారంలోకి వస్తామనే ధీమాను.. మోదీ వ్యక్తం చేశారు. దేశ ప్రజల సేవ కోసమే బీజేపీ ఉందన్నారు. ఒకప్పుడు.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవలేని స్థితిలో ఉన్న బీజేపీ కార్యకర్తల ఆదరణతో ఈ స్థాయికి వచ్చిందని.. ఏపీ నేతలకు.. స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. దేశ ప్రజలందరూ కలిసి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా శ్రీలంక నుంచి తిరుపతికి వచ్చారు మోదీ. ఆయన వచ్చే ముందు.. తిరుపతిలో గాలివాన బీభత్సం సృష్టించింది. సభ కోసం ఏర్పాటు చేసిన కొన్ని టెంట్లు కూలిపోయాయి. ఎయిర్ పోర్టులో గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ తో పాటు మంత్రులు స్వాగతం పలికారు.