ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ కూర్పు ఎలా ఉంటుందీ, ఎవరికి అవకాశం, శాఖల పంపిణీ, కూర్పుపై విశ్లేషణలూ… ఇలా అన్నీ ఒక్కవారంలోనే పూర్తయిపోయాయి. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతోపాటు ఫుల్ కేబినెట్ కొలువుదీరింది. దీంతో, ఇప్పుడు చర్చంతా మంత్రివర్గంలో కచ్చితంగా స్థానం దక్కుతుందనుకుని, బెర్త్ మిస్ అయినవారి గురించే! పార్టీలో ప్రముఖంగా ఉంటూ… అధికారంలోకి రాగానే వారికి మంత్రి పదవులు గ్యారంటీ అనుకున్నవారికి కూడా దక్కలేదు. అయితే, పార్టీ కోసం శ్రమించినవారిందరికీ న్యాయం చేస్తానని మంత్రివర్గ ఏర్పాటుకు ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఎదురుచూస్తున్న నాయకులకు కూడా సీఎం హామీపై పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అయితే, ఇప్పుడు చర్చ ఏంటంటే… ముఖ్యమంత్రి చేస్తానన్న న్యాయం కోసం వారంతా మరో రెండున్నర సంవత్సరాలు ఎదురుచూడాలా అని..?
మంత్రి పదవులు అయిపోయాయి కాబట్టి, ఇప్పుడు మిగిలినవి నామినేటెడ్ పోస్టుల భర్తీ. మంత్రి వర్గ కూర్పులో తనదైన శైలిని చూపించి, అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం ఉండేలా సీఎం జాగ్రత్తపడ్డారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా అదే తరహా కూర్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ పోస్టుల భర్తీలో భాగంగానే కేబినెట్ లో చోటు కల్పించలేని నేతలకు ప్రముఖ స్థానం కల్పించే అవకాశం ఉందనేది కూడా వైకాపా వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎమ్మెల్యే రోజా, అంబటి రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి… ఇలా కొంతమంది ప్రముఖ నేతలకు మంత్రి వర్గంలో స్థానం దక్కలేదు. వారికి కేబినెట్ లో స్థానం దక్కాలంటే… మరో రెండున్నరేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉంటుందేమో అని అభిప్రాయమూ ఉంది! ఎందుకంటే, ఇప్పుడు కొలువుదీరినవారిలో దాదాపు 90 శాతం మందిని రెండున్నేళ్ల తరువాత మార్చేసి, కొత్తవారికి స్థానం కల్పించాలనేది సీఎం వ్యూహం అనేది తెలిసిందే.
అలాగని, పార్టీ కోసం బాగా శ్రమించిన ఈ ప్రముఖులకు రాబోయే రెండున్నరేళ్లపాటు ఏ పదవీ ఇవ్వకుండా ఖాళీగా ఉంచేస్తారా..? ఉంచలేరు కదా. అందుకే, వీరిలో కొందరికి కేబినెట్ స్థాయి హోదాతో కూడిన నామినేటెడ్ పదవులు వస్తాయనే ప్రచారం ఇప్పుడు తెరమీదికి వచ్చింది. ఆర్టీసీ ఛైర్మన్, ఏపీఐఐసీ లాంటి కొన్ని కీలక పదవులను పార్టీలోని ప్రధాన నాయకులకు ఇవ్వాలని జగన్ ఆలోచనగా ఉందని అంటున్నారు. మరి, వీటిని ఎలా భర్తీ చేయాలని సీఎం జగన్ అనుకుంటున్నారో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.