వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశ ఎజెండాను చూస్తే.. అత్యంత సాహసోపేతంగా ఉంది. అత్యంత క్లిష్టమైన విషయాలు… ఆర్థిక భారం కాబట్టి.. వనరులు చూసుకుని… తీసుకోవాల్సిన నిర్ణయాలు అయిన ఐఆర్, సీపీఎస్ , ఆర్టీసీ విలీనం వంటి నిర్ణయాల ఎజెండా ఉంది. అందుకే తొలి కేబినెట్ భేటీతోనే జగన్ సంచలనం సృష్టించబోతున్నారని చెబుతున్నారు.
కేబినెట్ ఎజెండాలో అన్నీ కీలకమే..!
ఈ 8 అంశాలను కేబినెట్ భేటీకి సిద్ధం చేశారు. వృద్ధుల పెన్షన్లు రూ.2వేల నుంచి రూ.3వేల వరకూ పెంచుకుంటూ పోతామని ఎన్నికల ముందు జగన్ ప్రకటించారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ.250 పెంచుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడే తొలి సంతకం చేశారు. ఈ పెంపును కేబినెట్ ఆమోదించనుంది. ఆశా వర్కర్లకు వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ జగన్ తొలి సంతకం చేశారు. దానికీ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అక్టోబరు నుంచి అమలు చేయనున్న వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 చెల్లించే పథకానికి కేబినెట్ సమ్మతం తెలపనుంది. అలాగే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దు , ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, హోంగార్డుల వేతనాల పెంపు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు ఎజెండా కూడా రెడీ అయింది.
ఆ నిర్ణయాలు తీసుకుంటే జగన్ డేరింగ్ అండ్ డాషింగే..!
నిజానికి.. మొదటి కేబినెట్ భేటీలో ఉన్న అంశాలన్నీ అత్యంత కీలకమైనవే. ఉద్యోగులకు ఐఆర్ అంటే.. మధ్యంతర భృతి 27శాతం ఇస్తామని జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆ మేరకు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల జీతాల ఖర్చు నెలవారీగా 27 శాతం పెరిగిపోతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి ఇది అంత తేలిక కాదనే అభిప్రాయం ఉంది. అయినా జగన్ చేయబోతున్నారు. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తామని.. పాత పెన్షన్ విధాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా.. భారీగా ఆర్థిక భారాన్ని వేసే నిర్ణయం అయినా జగన్ ముందుకే వెళ్తున్నారు. ఇక ఆర్టీసీ విలీనం అంటే… అది అసాధ్యమని.. గతంలో టీడీపీ ప్రభుత్వం చెప్పింది.. చేసి చూపిస్తే మాత్రం… జగన్ అసాధ్యుడనే అనుకోవాలి. హోంగార్డులు, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై ఒక్క సంతకంతో నిర్ణయం తీసుకోవచ్చు. వీరికి తెలంగాణలో ఇస్తున్నదాని కంటే.. వెయ్యి ఎక్కువగా జీతాలు పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పారు. దాన్ని తొలి భేటీలోనే అమలు చేయాల్సి ఉంది.
కమిటీలతో కాలయాపన చేస్తే చెడ్డ పేరే..!?
మొదటి కేబినెట్ ఎజెండాలో ఉన్నవన్నీ సంచలనాత్మక నిర్ణయాలు.. వీటిపై ఫటా ఫట్ నిర్ణయాలు తీసుకోకుండా… కేబినెట్ సబ్ కమిటీలని.. అవని.. ఇవని.. వేస్తే.. కచ్చితంగా.. వాటిని కోల్డ్ స్టోరేజీలో పెడదామని అనుకోవడమే. మేనిఫెస్టోలో హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా.. ఎంతో కొంత కసరత్తు చేసే ఉంటారు. అందుకే.. ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటారని.. ఆయా స్కీమ్స్ వల్ల లాభపడేవారందరూ… కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులు… రేపట్నుంచి తాము ఆర్టీసీ కార్మికులం కాదని.. ప్రభుత్వ ఉద్యోగులం అనే నమ్మకంతో ఉన్నారు. మరి జగన్ చేస్తారా..?