టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనుంది. పోలీసులు అరెస్ట్ చేయకుండా.. ఇప్పటికే… అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమై… సుప్రీంకోర్టు సూచన మేరకు.. మళ్లీ హైకోర్టుకు వచ్చిన .. రవిప్రకాష్… గత కొన్ని రోజులుగా… పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు. మొదట.. ఫోర్జరీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత లోగో అమ్మకం కేసులో.. మరో రెండు రోజులు ప్రశ్నించారు. ఇవి అయిపోయేలోపు… ముందస్తు బెయిల్‌పై విచారణ.. హైకోర్టు ముందుకు వచ్చింది.
రవిప్రకాష్‌పై ప్రధానంగా నమోదైన కేసులు… కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేయడం. అయితే.. ఆ అవసరం తనకేమిటని.. రవిప్రకాష్ గతంలోనే ప్రకటించారు. దేవేందర్ అగర్వాల్.. తాను సీఈవోగా ఉన్నప్పుడు.. తన కింద పని చేసే ఓ పార్ట్ టైమ్ ఎంప్లాయీ మాత్రమేనని చెబుతున్నారు. ఆయన సంతకం ఫోర్జరీ చేస్తే తమకేం వస్తుందని… ప్రశ్నించారు. కానీ పోలీసులు మాత్రం.. ఆ ఫోర్జరీని రవిప్రకాషే చేశారని.. దాని వల్ల ఓ భయంకరమైన క్రైమ్ జరిగిపోయిందని.. ప్రజెంట్ చేస్తున్నారు. ప్రతీ రోజూ.. రవిప్రకాష్‌ను విచారించిన తర్వాత పోలీసులు… అసలు ఆయన విచారణకు సహకరించడం లేదని నేరుగా మీడియాకు చెప్పారు. దాదాదు ప్రతీ రోజూ… “అరెస్ట్ రేపే” అన్న సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు. కొన్ని రకాల మీడియా… వాటిని విస్తృతంగా ప్రచారం చేసింది. అదో మైండ్‌గేమ్‌లా సాగింది.
చివరికి లోగో అమ్మకం కేసులోనూ పోలీసులు అదే తీరులో వ్యవహరించారు. నిజానికి మేథోసంపత్తి హక్కులు. ఆయన అమ్మకం ఒప్పందం చేసుకుంటే… కచ్చితంగా ఆయనకు హక్కు ఉంటేనే చెల్లుతుంది. రవిప్రకాష్.. అవి తనకే ఉన్నాయని వాదిస్తున్నారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా పోలీసులకు ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే.. కేసును విచారిస్తున్న పోలీసులు మాత్రం.. రవిప్రకాష్ నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. మరి దోషిగా నిరూపించడానికి పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయో లేవో చెప్పడం లేదు. తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టులో పెడతామంటున్నారు. కానీ మీడియాకు మాత్రం ముందుగానే… మొత్తం చెప్పేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. రవిప్రకాష్‌ను అరెస్ట్ చేయడమే.. పోలీసుల లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో.. రవిప్రకాష్… సహకరించలేదని.. కచ్చితంగా అరెస్ట్ చేసి.. కస్టడీకి తీసుకుంటామని… పోలీసులు కోర్టును అడిగే అవకాశం ఉంది. అయితే.. విచారణకు.. సహకరిస్తున్నారని.. ఐదురోజుల పాటు.. రోజూ హాజరైన విషయాన్ని వివరించి.. విచారణకు అలాగే సహకరిస్తానని… ముందస్తు బెయిల్ ఇవ్వాలని రవిప్రకాష్ కోరే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయంపై మాత్రం ఉత్కంఠ ఏర్పడింది.