తెలంగాణ కాంగ్రెస్ శాసన సభ పక్షాన్ని అధికార పార్టీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఆయన 8వ తేదీన దీక్షకు కూర్చున్నారు. రాష్ట్రంలో ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ, ప్రతిపక్షం ఉనికి లేకుండా చేసేందుకు తెరాస ప్రయత్నిస్తోందనీ, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనేది భట్టి డిమాండ్. తెరాస తీరుకు నిరసనగా 36 గంటలు దీక్ష చేయాలని మొదట అనుకున్నారు. ఆదివారం నాడు ఆ దీక్షను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, సోమవారం ఉదయమే భట్టి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
భట్టి దీక్షను భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులు, కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం భట్టిని పోలీసులు అరెస్టు చేసి, నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫిరాయింపులపై తగిన చర్యలు తీసుకునేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆదివారం నాడే భట్టి ప్రకటించారు. ఈ దీక్షా శిబిరానికి కాంగ్రెస్ నేతలతోపాటు, ఇతర పార్టీల నాయకులు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. అయితే, దీక్షకు పోలీసులు ఇచ్చిన అనుమతులు ముగియడంతో ఏం చేస్తారనే చర్చ జరిగింది. అనుకున్నట్టుగానే ఇవాళ్ల ఉదయాన్నే పోలీసులు దీక్షను భగ్నం చేశారు.
దీక్ష భగ్నమైనా కూడా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామనీ, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామనీ, న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని అంటున్నారు. రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం చేశామని తెరాస చెబుతున్నా… ఫిరాయింపుల్ని ఇష్టానుసారం ప్రోత్సాహిస్తున్నారన్నది వాస్తవం. ఒక పార్టీ అనుమతి లేకుండా… ఆ పార్టీకి చెందిన శాసన సభా పక్షాన్ని విలీనం చేయడం సరికాదని నిపుణులూ అంటున్నారు. ఈ పాయింట్ మీద న్యాయ పోరాటం చేస్తే… కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. పార్టీపరంగా చూసుకున్నా కాంగ్రెస్ కి ఈ పోరాటం తెలంగాణలో అనివార్యం. మరి, ఈ సమరాన్ని టి. కాంగ్రెస్ నేతలు ఎంత ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్తారో చూడాలి.