ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో… ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఒకరు పాముల పుష్పశ్రీవాణి. ఆమె విజయనగరం జిల్లా ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి విజయం సాధించారు. గతంలోనూ ఆమె వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. ఆమె ఎస్టీ కాదని.. గిరిజన సంఘాలు.. ఆరోపణలు ప్రారంభించాయి. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పుడే.. ఈ వివాదం ప్రారంభమయింది. దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలతో కొంత కోర్టును ఆశ్రయించడంతో.. ప్రస్తుతం ఆమె కుల వివాదం కోర్టులో ఉంది. ఈ సమయంలో… ఆమెకు నేరుగా గిరిజన సంక్షేమ శాఖ అప్పగించడంతో.. గిరిజన సంఘాలు పోరుబాట పట్టాయి. నామినేషన్ పరిశీనల దశలో పుష్పశ్రీవాణి అందజేసిన కులధ్రువీకరణ పత్రం అర్హతను ప్రశ్నిస్తూ అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఆమె కుల వివాదం కోర్టులో ఉంది కాబట్టి… నామినేషన్ను అంగీకరించారు.
పాముల పుష్పశ్రీవాణి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు. ఆ జిల్లాలో కొండ దొర తెగలకు చెందినవారు. ఆ తెగల వారు విధిగా ఆర్టీవో స్థాయి అధికారి నుంచి కులధ్రువీకరణ పత్రం పొందాలనే నిబంధనలు ఉన్నాయి. పాముల పుష్ప శ్రీవాణి సోదరి.. పాముల రామతులసి పశ్చిమగోదావరి జిల్లా కోటసీతారాంపురం ఐటీడీఏలో ఎస్టీ కోటాలో కొన్నాళ్ల క్రితం ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఆమె నిజమైన ఎస్టీ కాదని కొందరు అక్కడి ఐటీడీఏ పీవోకు లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. ఆ మేరకు విచారణ జరిపిన అధికారులు రామతులసి ఎస్టీ తెలగలకు చెందిన వారు కాదని నిర్ధారించారు. ఎంపికైన ఉపాధ్యాయ నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను తీసుకుని… సోదరి ఎస్టీ కానప్పుడు పుష్పశ్రీవాణి మాత్రం ఎస్టీ ఎలా అవుతుందని అక్కడి వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు.. పుష్పశ్రీవాణి ఎస్టీ గా ఎన్నికలవడంతో.. ఈమె ఎంపికను కూడా కోర్టు కొట్టి వేస్తుందని చెబుతున్నారు. గతంలో .. ఇలా కుల వివాదాల్లో కోర్టులు ఫలానా రిజర్వుడు కులం కాదని.. తేలితే.. కొట్టి వేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో.. వారు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోతారు. ఇప్పుడు పుష్పశ్రీవాణి కూడా.. అదే వివాదంలో చిక్కుకున్నారు.